సైన్స్ నిత్యజీవితంలో భాగం
● ఎంపీ రఘునందన్‌రావు
● ముగిసిన ఇన్‌స్పైర్, వైజ్ఞానిక ప్రదర్శన
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): విద్యార్థులు నచ్చిన రంగంలో ఆకాశమే హద్దుగా రాణించాలని, మెదక్ ఎంపీ రఘునందన్‌రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో మూడు రోజులుగా నిర్వహించిన, జిల్లా స్థాయి ఇన్‌స్పైర్, వైజ్ఞానిక ప్రదర్శన శుక్రవారం ముగిసింది. 187 ఇన్‌స్పైర్, వైజ్ఞానిక ప్రదర్శనలో 236, ఐదు ఉపాధ్యాయ ప్రాజెక్టులను విద్యార్థులు ప్రదర్శించారు. ఇందులో రాష్ట్ర స్థాయికి 19 ఇన్‌స్పైర్, 14 వైజ్ఞానిక ప్రదర్శనలు, ఒకటి ఉపాధ్యాయ ప్రాజెక్టులు ఎంపికయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మెదక్ ఎంపీ రఘునందన్‌రావు మాట్లాడుతూ.. విద్యార్థుల్లోని సృజనాత్మకతను, నైపుణ్యాన్ని వెలికితీయాలన్నారు. రోదశి నుంచి వచ్చిన విలియమ్స్ లాగా సిద్దిపేట విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎదగాలన్నారు. సైన్స్ నిత్య జీవితంలో ఓ భాగమని, సైన్స్ లేనిదే ఏదీ లేదని ప్రతి ఒక్కటి దాంతో ముడిపడి ఉందని, పట్టభద్రుల ఎమ్మెల్సీ అంజిరెడ్డి పేర్కొన్నారు. అబ్దుల్ కలాంను ఆదర్శంగా తీసుకొని సైన్స్‌లో రాణించాలన్నారు. అనంతరం విద్యార్థులకు ప్రశంసాపత్రాలు, బహుమతులు అందజేశారు. అంతకు ముందు విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి, డీఈవో శ్రీనివాస్‌రెడ్డి, డీఎస్‌వో శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.


