అడ్డగోలుగా పనులు.. అంతా తప్పిదాలు | - | Sakshi
Sakshi News home page

అడ్డగోలుగా పనులు.. అంతా తప్పిదాలు

Nov 1 2025 8:36 AM | Updated on Nov 1 2025 8:36 AM

అడ్డగ

అడ్డగోలుగా పనులు.. అంతా తప్పిదాలు

అరకొర స్థలాల్లో నిర్మాణాలు

బస్సుల రాకపోకలకు ఇబ్బందులు

గజ్వేల్‌, ప్రజ్ఞాపూర్‌ మున్సిపాలిటీలో దుస్థితి

అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు

గజ్వేల్‌: బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ గజ్వేల్‌–ప్రజ్ఞాపూర్‌ మున్సిపాలిటీని రాష్ట్రంలోనే మోడల్‌గా తీర్చిదిద్దాలని సంకల్పించారు. ఈ క్రమంలోనే తాను సీఎంగా పనిచేసిన పదేళ్లల్లో నిధుల వరద పారించారు. కానీ అధికారులు అడ్డదిడ్డమైన డిజైన్లతో కీలకమైన పనుల లక్ష్యాన్ని దెబ్బతీశారు. బస్టాండ్‌ల నిర్మాణమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. కొన్నేళ్ల క్రితం ఎస్‌డీఎఫ్‌ ద్వారా మున్సిపాలిటీ పరిధిలోని తూప్రాన్‌ రోడ్డువైపున మోడ్రన్‌ బస్టాండ్‌ నిర్మాణానికి రూ.5.47కోట్లు, గజ్వేల్‌ పట్టణంలోని ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ పక్కన మూవింగ్‌ బస్టాండ్‌ నిర్మాణానికి రూ.2.86కోట్లు, ప్రజ్ఞాపూర్‌ చౌరస్తాలో బస్టాండ్‌ నిర్మాణానికి రూ.3.81కోట్లు మంజూరు చేశారు. రెండేళ్ల క్రితం తూప్రాన్‌ రోడ్డు వైపున ఉన్న బస్టాండ్‌ పూర్తికాగా వినియోగంలోకి రాకుండా నిరుపయోగంగా మారింది. పట్టణానికి దూరంగా ఉండటం వల్ల ఈ పరిస్థితి నెలకొంది. మరోవైపు ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ పక్కన నిర్మిస్తున్న బస్టాండ్‌ పనులు పూర్తికావస్తున్నాయి. ట్రాఫిక్‌ సమస్యలను నిర్మూలిస్తుందని భావించి నిర్మించిన ఈ బస్టాండ్‌.. వినియోగంలోకి వస్తే ట్రాఫిక్‌ సమస్య మరింతగా జఠిలం కాబోతున్నది. అడావుడిగా నిర్మించిన ఈ బస్టాండ్‌లో బస్సులు నిలిపే అవకాశమే లేదు. ఒకవేళ బస్సులు నిలిపితే తర్వాత వచ్చే బస్సులతో ప్రయాణికులు, బస్సులతో మరింతగా కిక్కిరిసిపోనున్నది. అంతేకాకుండా ఇన్‌, అవుట్‌ బస్సులు వెళ్లడానికి తీవ్రమైన ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తనున్నాయి. ఇది తెలిసీ కూడా అధికారులు ఈ బస్టాండ్‌ను ఎలా డిజైన్‌ చేశారో అర్థంకానీ పరిస్థితి. మరో ముఖ్యవిషయమేమిటంటే ఆర్‌టీసీకి చెందిన ఇంజినీర్ల పాత్ర లేకుండా బస్టాండ్‌ నిర్మాణాలను డిజైన్‌ చేయడం గమనార్హం.

ప్రజ్ఞాపూర్‌లో ఇలా...

ప్రజ్ఞాపూర్‌లో ఎకరం స్థలంలో నిర్మించిన బస్టాండ్‌లోనూ డిజైన్‌ లోపాలు బయటపడుతున్నాయి. ప్రస్తుతం రూ.3.81కోట్లతో పనులు సాగుతుండగా, ఈ నిధులు సరిపోక మరో రూ.1కోటి అదనంగా కావాలని అధికారులు ప్రతిపాదనలు పంపారు. ఈ బస్టాండ్‌ ముందు భాగంలో వరద కాల్వ ఉంది. దీనిపై బస్సులు ఇన్‌, అవుట్‌ కోసం కల్వర్టు నిర్మాణం కోసం సరైన డిజైన్‌ లేదు. అంతేకాకుండా భువనగిరికి వెళ్లే బస్సు ఈ బస్టాండ్‌లో ఆగితే తిరిగి రాంగ్‌ రూట్‌లోనే వెళ్లేలా డిజైన్‌ ఉంది. ఈ నేపథ్యంలో రాబోవు రోజుల్లో ఈ బస్టాండ్‌లు వినియోగంలోకి వస్తే తలెత్తే సమస్యలపై ఆందోళన నెలకొన్నది. గజ్వేల్‌ మూవింగ్‌ బస్టాండ్‌ వద్ద ఎన్‌హెచ్‌ఏఐ(నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా) అనుమతితో డివైడర్‌ తగ్గిస్తే.. బస్సులు కొంతమేర తిరిగే అవకాశం ఉంది. ప్రజ్ఞాపూర్‌ బస్టాండ్‌లోని లోపాలను సైతం సరిచేస్తే కొంత ఉపయోగకరంగా మారే అవకాశాలున్నాయి. ఈనేపథ్యంలో అధికారుల ఎలాంటి చర్యలు తీసుకుంటారో అనేది వేచి చూడాల్సిందే.

రాష్ట్రానికే నమూనాగా ఊదరగొట్టిన గజ్వేల్‌–ప్రజ్ఞాపూర్‌ మున్సిపాలిటీలో అధికారుల తప్పిదాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇక్కడ రూ.12.14కోట్ల వ్యయంతో నిర్మించిన మూడు ఆర్టీసీ బస్టాండ్‌ల నిర్మాణాల్లో చోటుచేసుకున్న డిజైన్‌ లోపాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ తప్పిదాల వల్ల రాబోయే రోజుల్లో సమస్యలు మరింత జఠిలం అవుతుండగా, అధికారుల అడ్డదిడ్డమైన పనులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

బస్టాండ్ల నిర్మాణాల్లో

డిజైన్‌ లోపాలు

అడ్డగోలుగా పనులు.. అంతా తప్పిదాలు1
1/1

అడ్డగోలుగా పనులు.. అంతా తప్పిదాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement