వరద కాలువల నిర్మాణం కోసం సర్వే
హుస్నాబాద్: పట్టణంలో శాశ్వత వరద కాలువల నిర్మాణం కోసం మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులు శుక్రవారం సర్వే నిర్వహించారు. వర్షాలు కురిసిన ప్రతిసారీ వరదలు వివిధ కాలనీలు, మెయిన్ రోడ్డును ముంచెత్తుతున్నాయి. వరదలను నివారించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై పట్టణంలో సర్వే చేశారు. వ్యవసాయ మార్కెట్ యార్డు, పోలీస్ స్టేషన్ ఏరియాలను పరిశీలించారు. మరో సారి సర్వే చేసి దాని ఆధారంగా డీపీఆర్ తయారు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్, పబ్లిక్ హెల్త్, మున్సిపల్ శాఖ ఎస్‌ఈ వెంకటేశ్వర్లు, డీఈలు తిరుపతి, మహేష్, ఎంఏఈలు పృద్విరాజ్, మహేష్‌లు ఉన్నారు.
వైవిధ్యం.. కాంతిమంతం
వర్గల్(గజ్వేల్): వైవిధ్యమైన ఆకృతులలో వెలుగులు చిమ్ముతున్న కార్తీక జ్యోతులు నాచగిరిని శోభాయమానం చేస్తున్నాయి. శుక్రవారం రాత్రి ఈఓ విజయరామారావు పర్యవేక్షణలో అర్చక, సిబ్బంది కార్తీక సామూహిక సహస్ర దీపోత్సవానికి తగు ఏర్పాట్లు చేశారు. భక్తజనులు నక్షత్ర ఆకృతిలో దివ్వెలను వెలిగించి తరించారు. స్వామివారి ఆశీస్సులు పొందారు.
2న మల్లకంబ్
క్రీడాకారుల ఎంపిక
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): ఉమ్మడి మెదక్ జిల్లా మల్లకంబ్ క్రీడాకారుల ఎంపిక ఈ నెల 2న నిర్వహించనున్నట్లు ఎస్‌జీఎఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ సౌందర్య శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నారాయణరావుపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆదివారం ఉదయం 9.30గంటల నుంచి అండర్–14, 17 విభాగాల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలకు స్థానిక పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు సతీష్ (99481 10433)ను సంప్రదించాలన్నారు.
కుల వివక్ష నేరం
ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ భవ్య
కొండపాక(గజ్వేల్): కులాల పేరుతో చిన్న చూపు చూడటం చట్టరీత్యా నేరమని ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ భవ్య అన్నారు. మండల పరిధిలోని రాంపల్లిలో శుక్రవారం పౌరహక్కుల దినోత్సవ గ్రామ సభ నిర్వహించారు. భవ్య మాట్లాడుతూ గ్రామాల్లో ఎక్కడైనా రెండు గ్లాసుల పద్ధతులు పాటిస్తే వెంటనే పోలీస్టేషన్‌కు సమాచారం అందించాలన్నారు. సమష్టి కృషితో గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలన్నారు. కులాలు, మతాల పేరిట ప్రవర్తిస్తూ ఇతరులను ఇబ్బందులు పెట్టడం సరికాదన్నారు. పౌరుల హక్కులకు భంగం కలగకుండా రెవెన్యూ, పోలీస్ శాఖలు చూసుకోవాలన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ మల్లికార్జున్‌రెడ్డి, ఆర్‌ఐ బాలకిషన్, నాయకులు సురేందర్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శి పాల్గొన్నారు.
మామిడాలకు
‘మహిళా సేవా రత్న’
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): సమాజ సేవలో విశేషమైన కృషి చేస్తున్న ఎన్‌ఎస్‌యూఐ జిల్లా సోషల్ మీడియా చైర్‌పర్సన్ మామిడాల స్రవంతికి మహిళ సేవా రత్న అవార్డు వరించింది. శుక్రవారం హైదరాబాద్‌లోని త్రివేణి సంగమ కల్చరల్ అకాడమీ ఆధ్వర్యంలో వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన వారికి సేవా రత్న అవార్డులు అందించారని, ఇందులో భాగంగా తనకు మహిళా సేవా రత్న అవార్డును ప్రదానం చేశారని స్రవంతి తెలిపారు.
వరద కాలువల నిర్మాణం కోసం సర్వే
వరద కాలువల నిర్మాణం కోసం సర్వే


