తడిసిన ధాన్యం కొనుగోలు
మంత్రి ఆదేశాలతో కదిలిన అధికారులు రైతుల్లో హర్షాతిరేకాలు
హుస్నాబాద్: మోంథా తుపాన్ ప్రభావంతో మార్కెట్ యార్డులో తడిసిన ధాన్యాన్ని అధికారులు కొనుగోలు చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాలతో సివిల్ సప్లయ్ కమిషనర్, కలెక్టర్ హైమావతి మార్గదర్శకత్వంలో అధికారులు శుక్రవారం మార్కెట్ యార్డును సందర్శించారు. రైతులు నష్టపోకుండా తడిసిన ధాన్యం మొత్తాన్ని కొనుగొలు చేస్తామని హామీ ఇచ్చారు. దీనిలో భాగంగా 18 లారీలను ఏర్పాటు చేసి 100 మందికి పైగా హమాలీ కార్మికులను రంగంలోకి దింపారు. 100 మందికి పైగా రైతుల నుంచి సుమారు 526 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. కొనుగొలు చేసిన ధాన్యాన్ని జిల్లాలోని రైస్ మిల్లులకు ఒక్కో లారీ చొప్పున తరలించారు. రైతులు సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సివిల్ సప్లయ్ కమిషనర్ ఆఫీస్ నుంచి డిప్యూటి కమిషనర్ కొండల రావు, ప్రొక్యూర్‌మెంట్ జీఎం నాగేశ్వర్ రావులు పాల్గొన్నారు.


