వరి కోతలు వద్దు.. ధాన్యం తడవొద్దు
● ‘మొంథా’ వేళ అప్రమత్తంగా ఉండాలి ● కలెక్టర్ హైమావతి ● పలు కొనుగోలు కేంద్రాల సందర్శన
కొమురవెల్లి(సిద్దిపేట): మొంథా తుపాన్ నేపథ్యంలో కురుస్తున్న వర్షాలకు రైతులు ధాన్యం తడవకుండా చూసుకోవాలని, వరి కోతలు వాయిదా వేసుకోవాలని కలెక్టర్ హైమావతి రైతులకు సూచించారు. మంగళవారం మండలంలోని మర్రిముచ్చాల, గౌరాయపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాలలో గన్నీ బ్యాగులు, తేమ కొలిచే యంత్రాలు, కాంటాలు, ప్యాడీ క్లీనర్లను ఉంచుకోవాలని అధికారులను ఆదేశించారు. అదే విధంగా అకాల వర్షాలకు ధాన్యం తడవకుండా టార్పాలిన్ కవర్లను అందుబాటులో ఉంచాలన్నారు. తేమ శాతం రాగానే ధాన్యాన్ని కాంటా చేసి తరలించాలని సూచించారు. ఎవరైనా అశ్రద్ధ చేస్తే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించాలి
సిద్దిపేటఅర్బన్: విద్యార్థులు భోజనం చేసే సమయంలో ఉపాధ్యాయులు పర్యవేక్షణ చేయ డం లేదని, తప్పకుండా పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ హైమావతి సూచించారు. మంగళవారం సిద్దిపేట అర్బన్ మండలం ఎన్సాన్‌పల్లిలోని గురుకుల పాఠశాలల్లో మధ్యాహ్న భోజన ప్రక్రియను పరిశీలించారు. భోజనం చేసే సమయంలో విద్యార్థులను పర్యవేక్షణ చేస్తేనే క్రమశిక్షణ పాటిస్తారన్నారు. ఇష్టానుసారంగా వదిలేస్తే ఎలా అని గురు కుల పాఠశాలల ప్రిన్సిపాల్స్‌ను హెచ్చరించారు. విద్యార్థులు అందరూ తిన్న తర్వాతనే ఉపాధ్యాయులు తినాలని ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయులను హెచ్చరించారు. కామన్ డైట్ మెనూ తప్పనిసరిగా పాటించాలని, రుచికరంగా వండాలని వంట సిబ్బందిని ఆదేశించారు. విద్యార్థుల భోజన వసతి, చదువు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.


