గణితంపై ఆసక్తి కలిగేలా బోధించండి
● డీఈఓ శ్రీనివాస్‌రెడ్డి ● ఉపాధ్యాయులకు దిశానిర్దేశం
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): విద్యార్థుల్లో గణితం అంటే భయం లేకుండా ఆసక్తిని కల్గించేలా బోధించాలని డీఈఓ శ్రీనివాస్‌రెడ్డి ఉపాధ్యాయులకు సూచించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో మంగళవారం కెపాసిటీ బిల్డింగ్ ట్రైనింగ్ అనే అంశంపై జిల్లాలోని గణిత ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డీఈఓ మాట్లాడుతూ భారతీయ విజ్ఞాన సంపదకు గణితం పునాది వంటిదన్నారు. నేటి ఆధునిక కాలంలో గణిత పరిజ్ఞాన అవసరం అత్యధికంగా పెరుగుతోందన్నారు. మానవుడు తార్కికంగా వేగంగా ఆలోచించడానికి గణితం ఉపయోగపడుతుందన్నారు. విద్యార్థిలో మేధో సంపత్తిని గణిత పరిజ్ఞానంతో కొలమానం వేయవచ్చాన్నారు. విద్యార్థుల్లోని తెలివితేటలను గణితం పదును పెడుతుందన్నారు. ఉపాధ్యాయులు శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకొని విద్యార్థులల్లో గణిత పరిజ్ఞానం పెంపొందించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని గణిత ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


