
పంట నష్టం వివరాలు అందించండి
ఆర్డీఓ సదానందం
మిరుదొడ్డి(దుబ్బాక): అకాల వర్షాలతో నష్టపోయిన పంటల పూర్తి వివరాలను అధికారులకు అందించాలని సిద్దిపేట ఆర్డీఓ సదానందం రైతులను కోరారు. మిరుదొడ్డి మండల కేంద్రంతో పాటు, అక్బర్‌పేట–భూంపల్లి మండల పరిధిలోని రుద్రారంలో నష్టపోయిన వరి, మొక్కజొన్న, కూరగాయల పంటలను సిద్దిపేట ఆర్డీఓ సదానందం సోమవారం క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూడవెల్లి పరీవాహక పరిధిలో ఇటీవల కురిసిన వడగండ్ల వర్షాలతో 574 మంది రైతులకు సంబంధించిన 1600 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు అంచనా వేయడం జరిగిందన్నారు. కలెక్టర్‌కు నివేదికను అందించి నష్ట పరిహారం అందించేలా చర్యలు చేపడతామని తెలిపారు. ఆయా కార్యక్రమంలో తహసీల్దార్లు ఉదయశ్రీ, మల్లిఖార్జున్‌రెడ్డి, మిరుదొడ్డి మండల వ్యవసాయ అధికారులు మల్లేశం, ఆర్‌ఐలు తదితరులు పాల్గొన్నారు.