
ఆర్టీసీ కార్మికులతో చర్చలకు సిద్ధం
హుస్నాబాద్: ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించేందుకు మా తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని, ఆర్టీసీ కార్మికులతో చర్చలకు సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఆదివారం హుస్నాబాద్ బస్టాండ్‌ను సందర్శించి ప్రయాణికులు, డ్రైవర్లు, కండక్టర్ల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ ఈ నెల 5, 6వ తేదీల్లో తాను హైదరాబాద్‌లోనే ఉంటానని, ఆర్టీసీ ఉద్యోగులు ఎవరైనా వచ్చి సమస్యలపై చర్చించవచ్చన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో రవాణా వ్యవస్థ బాగుండాలని కొత్త బస్సులు, నియామకాలు, కారుణ్య నియామకాలు చేపట్టామని తెలిపారు. గత పదేళ్లుగా సమ్మెతో అనేక మంది చనిపోయినా పట్టించుకోలేదన్నారు. ఒక్క బస్సు కొనుగొలు చేయకుండా, ఒక్క నియామకం చేపట్టకుండా ఆర్టీసీ వ్యవస్థను నిర్వీర్యం చేశారన్నారు. ఆర్టీసీ ఇప్పుడిప్పుడే ముందుకు వెళ్తుండటంతో సమ్మె చేస్తే మూలిగే నక్కపై తాటి పండు పడిన విధంగా చేయవద్దన్నారు. ఆర్టీసీ లాభాల బాటలో నడుస్తున్న సందర్భంలో పాత అప్పులు, పాత పీఎఫ్, సీసీఎస్ బకాయిలు తగ్గిస్తూ రిటైర్మెంట్ రోజున వారి నిధులు ఇచ్చే ప్రయత్నం జరుగుతోందని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి, డిపో మేనేజర్ వెంకన్న, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్, కాంగ్రెస్ నాయకులు చిత్తారి రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
గత ప్రభుత్వ హయాంలో
సంస్థ నిర్వీర్యం
మంత్రి పొన్నం ప్రభాకర్