
తొలిరోజు 95శాతం హాజరు
హాల్‌టికెట్లను తనిఖీ చేస్తున్న అధ్యాపకులు
● ఇంటర్ పరీక్షలు షురూ..
● పర్యవేక్షించిన అధికారులు
సిద్దిపేటఎడ్యుకేషన్: జిల్లాలో ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలు ప్రారంభమయ్యాయి. బుధవారం ప్రథమ సంవత్సరం జనరల్ విద్యార్థులకు సెకండ్ లాంగ్వేజ్, ఒకేషనల్ విద్యార్థులకు జనరల్ ఫౌండేషన్ కోర్సు పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. విద్యార్థులు ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. జిల్లా వ్యాప్తంగా 43 పరీక్షా కేంద్రాల్లో జనరల్, ఒకేషనల్ రెండు విభాగాల్లో 10,542 మంది విద్యార్థులకు 9,976 మంది హాజరయ్యారు. 95శాతం హాజరు నమోదు అయింది. కలెక్టర్ మనుచౌదరి పట్టణంలోని ప్రభుత్వ బాలికల కళాశాలతో పాటు పలు ప్రైవేట్ కళాశాలల పరీక్షా కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించి అధికారులకు సూచనలు, సలహాలు అందించారు. అదనపు కలెక్టర్లు అబ్దుల్‌హమీద్ చేర్యాల, ముస్త్యాల పరీక్షా కేంద్రాలను, కొండపాక పరీక్షా కేంద్రాలను గరిమాఅగర్వాల్ తనిఖీ చేశారు. ఇంటర్ బోర్డు డిప్యూటీ సెక్రటరీ యాదగిరి సిద్దిపేట ప్రభుత్వ కోఎడ్యుకేషన్, బాలికల కళాశాలలను సందర్శించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఇంటర్ విద్యాధికారి రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ పరీక్షల్లో ఎలాంటి అవకతవకలు జరగకుండా ఉండేందుకు డీఈసీ సభ్యులతో పాటు రెండు ఫ్లైయింగ్, మూడు సిట్టింగ్ స్క్వాడ్ బృందాలు పలు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశాయన్నారు. సిద్దిపేట వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ కస్టోడియన్ పాయింట్‌ను ఇంటర్ బోర్డు అధికారులు సందర్శించారు.

తొలిరోజు 95శాతం హాజరు