రూ.14 కోట్లు | - | Sakshi
Sakshi News home page

రూ.14 కోట్లు

May 2 2026 12:01 PM | Updated on May 2 2026 12:01 PM

ఖరారైన ఉద్యానవన పంటల కార్యాచరణ ప్రణాళిక గతేడాది మంజూరు చేసిననిధులు రూ.9.10 కోట్లు విడుదలైనవి రూ.5.54 కోట్లు మాత్రమే

హార్టికల్చర్‌కు

సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ఉద్యానవన పంటల సాగు ప్రణాళిక ఖరారైంది. ఈ పంటలు సాగు చేసే రైతులకు వివిధ పథకాల కింద ఇచ్చే సబ్సిడీల కోసం జిల్లాకు ఈ ఆర్థిక ఏడాది 2026–27 కోసం రూ.14.13 కోట్లు మంజూరయ్యాయి. ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలున్నాయి. పండ్ల తోటలు, పూల మొక్కలు, కూరగాయలు, తేనెటీగల పెంపకం, సుగంధ ద్రవ్యాలు సాగు చేసే రైతులకు వివిధ పథకాల కింద ప్రభుత్వం సబ్సిడీలు ఇస్తుంది. ఈ పథకాలకు సంబంధించి ఈసారి 12,199 మంది రైతులకు లబ్ధి చేకూర్చాలని లక్ష్యంగా నిర్ణయించారు.

70 వేల ఎకరాల్లో సాగు

జిల్లాలో ఏటా సుమారు 70 వేల ఎకరాలకు పైగా ఉద్యానవన పంటలు సాగవుతాయి. ఇందులో మామిడి, జామ వంటి పండ్ల తోటలు, కూరగాయలు, పూలతోటలతోపాటు, ఓమ, అల్లం వంటి సుగంధ ద్రవ్యాలకు సంబంధించిన పంటలు కూడా సాగవుతాయి. ఆయా పంటలు సాగు చేసే రైతులకు ఉద్యానవన శాఖ ద్వారా ఉచితంగా విత్తనాలు, సబ్సిడీపై ఎరువులు, పురుగుమందులు పంపిణీ చేస్తారు. అలాగే వ్యవసాయ యాంత్రీకరణ వంటి పథకాల కింద వ్యవసాయ యంత్ర పనిముట్లు కూడా సబ్సిడీపై ఇస్తారు. స్ప్రేయర్లు, రొటోవేటర్లు, మినీ ట్రాక్టర్లు, సీడ్‌ డ్రిలర్లు వంటి ఆధునిక పనిముట్లు కూడా సబ్సిడీపై ఇచ్చి ప్రోత్సహిస్తుంటారు. అలాగే మామిడి, జామ, బొప్పాయి వంటి తోటల నిర్వహణ (మెయింటెనెన్స్‌) కింద కొంతమొత్తంలో ప్రోత్సాహకాలను అందిస్తారు. ఉల్లిగడ్డలు వంటి పంటలు సాగు చేసే రైతులకు తాత్కాలిక స్టోరేజీ స్ట్రక్చర్లు నిర్మించుకునేందుకు సబ్సిడీలు ఇస్తారు. షేడ్‌నెట్లు, మల్చింగ్‌ వంటివాటిని కూడా సరఫరా చేస్తుంటారు. ఇలా ఆయా పథకాల కింద ఇచ్చే ఈ ప్రోత్సాహకాలకు సంబంధించిన సబ్సిడీల కోసం ఈ ఆర్థిక ఏడాదిలో జిల్లాకు రూ.14.13 కోట్లను వినియోగించుకోనున్నారు.

సూక్ష్మసేద్య పరికరాలు సైతం

రిమిత నీటి పారుదల సౌకర్యంతో ఎక్కువ విస్తీర్ణంలో ఉద్యానవనపంటలు సాగు చేసే రైతులకు ప్రభుత్వం సూక్ష్మసేద్య పథకం కింద డ్రిప్‌, స్ప్రింక్లర్ల పరికరాలను సరఫరా చేస్తుంది. ఇందుకోసం భారీ మొత్తంలో సబ్సిడీలు ఇస్తుంది. ఎస్సీ,ఎస్టీ రైతులకు ఏకంగా వంద శాతం (ఉచితంగా) ఈ యూనిట్లు మంజూరు చేస్తారు. బీసీ రైతులకు 90% సబ్సిడీ, ఇతర రైతులకు 80% మేర సబ్సిడీలు ఇస్తారు. ఈ పథకానికి కూడా ఈ నిధులను వినియోగించనున్నారు.

వివిధ పథకాల కింద12 వేలమంది రైతులకు లబ్ధి

కేటాయింపులు సరే.. విడుదలే ప్రశ్నార్థకం

ఉద్యానవన పంటల సాగును ప్రోత్సహించడమే లక్ష్యంగా సబ్సిడీల కోసం ప్రభుత్వం ఏటా నిధులు కేటాయిస్తున్నప్పటికీ అవి పూర్తిస్థాయిలో విడుదల కాకపోవడం విమర్శలకు దారితీస్తోంది. గత ఆర్థిక ఏడాది 2025–26లో జిల్లాకు వివిధ పథకాల సబ్సిడీల కోసం రూ.9.10 కోట్లు మంజూరు చేయగా రూ.5.54 కోట్లు మాత్రమే విడుదలయ్యాయి. ఇంకా రూ.3.56 కోట్లు విడుదల కాలేదు. దీంతో నిర్దేశిత ప్రణాళికను పూర్తిస్థాయిలో అమలు చేయలేకపోయారు. ఈసారైనా మంజూరైన నిధులను ప్రభుత్వం విడుదల చేస్తే రైతులకు మేలు జరుగుతుందనే అభి ప్రాయం వ్యక్తమవుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement