నేడు హిందూ సమ్మేళనం | - | Sakshi
Sakshi News home page

నేడు హిందూ సమ్మేళనం

May 2 2026 12:01 PM | Updated on May 2 2026 12:01 PM

జహీరాబాద్‌ టౌన్‌: రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం పట్టణంలో హిందూ సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు ఉత్సవ కమిటీ సభ్యులు శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. పట్టణంలోని దత్తగిరి కాలనీ కమిటీ ఆధ్వర్యంలో అల్గోల్‌ రోడ్డులోని పీవీఆర్‌ గార్డెన్‌లో సాయంత్రం 5 గంటలకు సమ్మేళనం ప్రారంభమవుతుందన్నారు. ఆత్మీయ హిందూ బంధువులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని కోరారు.

యువత వ్యవసాయంపై

దృష్టి పెట్టాలి

వ్యవసాయ శాస్త్రవేత్తలు కిరణ్‌రెడ్డి, చిరంజీవి

కొండాపూర్‌(సంగారెడ్డి): గ్రామాల్లో యువత వ్యవసాయంపై దృష్టి పెట్టాలని శాస్త్రవేత్తలు కిరణ్‌రెడ్డి, చిరంజీవి కోరారు. రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల కార్యక్రమంలో శుక్రవారం మారేపల్లిలో నిర్వహించిన రైతులకు అవగాహన కార్యక్రమంలో వీరు పాల్గొని మాట్లాడారు. ప్రతీ రైతు తమ పంట పొలాల్లోని మట్టిని సేకరించి భూసార పరీక్షలు నిర్వహించుకోవాలని భూసార పరీక్షల ఫలితాల ఆధారంగానే వ్యవసాయాధికారుల సూచనల మేరకు పంటలను సాగు చేసుకోవాలని తెలిపారు. పంటల్లో రసాయనిక ఎరువులను పరిమితంగా వినియోగించాలని చెప్పారు. తద్వారా సాగు ఖర్చులు తగ్గి, నేలకు ఆరోగ్యం చేకూరుతుందన్నారు. పంట మార్పిడుల ద్వారా అధిక ఆదాయాన్ని పొందవచ్చని సూచించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్‌ శ్రీకాంత్‌, వ్యవసాయాధికారి గణేశ్‌, ఏఈఓ రవి, రైతులు మొగులయ్య, అనిల్‌కుమార్‌,రాజు, నారాయణ, లక్ష్మణ్‌, మధుగౌడ్‌, నారాయణ పాల్గొన్నారు.

కార్మికులకు సౌకర్యాలు

కల్పించాలి: సౌజన్య

సంగారెడ్డి టౌన్‌: ఇటుక బట్టీ వద్ద కార్మికులకు సౌకర్యాలను కల్పించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్య స్పష్టం చేశారు. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి మండలంలోని హనుమాన్‌నగర్‌ పరిధిలోని ఇటుక బట్టీ కార్మికులకు న్యాయ అవగాహనపై సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..బాల్య వివాహాలను ప్రతీ ఒక్కరు అరికట్టాలని, చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని, సోషల్‌ మీడియా వినియోగం తగ్గించుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో పోలీస్‌ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఖేడ్‌ కమిషనర్‌ బదిలీ

నారాయణఖేడ్‌: ఖేడ్‌ మున్సిపల్‌ కమిషనర్‌ జగ్జీవన్‌ ఎల్లారెడ్డి మున్సిపల్‌ కమిషనర్‌గా బదిలీ అయ్యారు. ఆయన మేనేజర్‌ వెంకటశివయ్యకు శుక్రవారం బాధ్యతలు అప్పగించి రిలీవ్‌ అయ్యారు. గ్రూప్‌ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి శిక్షణ పూర్తి చేసుకున్న వి.ప్రశాంతి ఖేడ్‌ కొత్త కమిషనర్‌గా పోస్టింగ్‌ ఇచ్చారు. రెండేళ్లపాటు పనిచేసిన జగ్జీవన్‌ ఖేడ్‌లో పారిశుద్ధ్య సమస్య పరిష్కారంతోపాటు పట్టణాభివృద్ధికి పాటుపడ్డారు.

జొన్నలు కొనుగోలు చేయాలి

మాజీ ఎమ్మెల్యే ఎం.భూపాల్‌రెడ్డి

కల్హేర్‌(నారాయణఖేడ్‌): రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా జొన్నలు కొనుగోలు చేయాలని ఖేడ్‌ మాజీ ఎమ్మెల్యే ఎం.భూపాల్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. కల్హేర్‌లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ..కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏ పంటలు కూడా సరిగా కొనుగోలు చేయడంలేదన్నారు. ప్రతీ పంట కొనుగోలు చేసి అదనంగా బోనస్‌ ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్‌ ఆ తర్వాత వాటి ఊసే ఎత్తడం లేదని విమర్శించారు. రైతులు పండించిన జొన్న, మొక్కజొన్న, కందులు, శనగలు, చివరి గింజ వరకు కొనుగోలు చేయాలని డిమాండు చేశారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ నర్సింహారెడ్డి, బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు రాంసింగ్‌, మాజీ కో ఆప్షన్‌ సభ్యులు ఎంఏ.ఘని, నాయకులు బాలయ్య, నర్సింహగౌడ్‌, వెంకట్‌నాయక్‌, గంట విఠల్‌, మాణిక్‌ప్రభు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement