జిల్లాలో ఎనిమిది పరీక్ష కేంద్రాలు హాజరు కానున్న2,772 మంది అభ్యర్థులు మార్గదర్శకాలు పాటించాలనిఅధికారుల సూచన
సంగారెడ్డి జోన్: వైద్య కళాశాలల్లోని పలు కోర్సులలో ప్రవేశాల కోసం ఆదివారం నిర్వహించనున్న నేషనల్ ఎలిజిబిలీటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్)–2026కు జిల్లాలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లాలో 8 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. 2,772 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు ఉదయం 11.00 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంట వరకు మాత్రమే పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు. మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష కొనసాగుతుంది. పరీక్షకు 30 నిమిషాల ముందే చేరుకోవాల్సి ఉంటుంది. బయోమెట్రిక్ హాజరు, రిజిస్ట్రేషన్, తనిఖీలు చేస్తారు. ఇటీవల కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ పరితోశ్ పంకజ్ అధికారులతో సమావేశం నిర్వహించి, నీట్ నిర్వహణపై సమీక్షించిన సంగతి తెలిసిందే.
అన్ని రకాల వసతులు
ప్రతి పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేస్తున్నారు. ప్రశ్నపత్రాల రవాణా, పరీక్ష అనంతరం జవాబు పత్రాల భద్రత కోసం పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఫస్ట్ ఎయిడ్ సెంటర్లు ఏర్పాటు చేసి, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, అవసరమైన మందులు సిద్ధంగా ఉంచనున్నారు. విద్యుత్తు సౌకర్యం, త్రాగునీరు, మరుగుదొడ్లు, పారిశుద్ధ్య నిర్వహణ వంటి సదుపాయాలు పూర్తి చేస్తున్నారు.
అభ్యర్థులు తప్పనిసరిగా తీసుకురావాల్సినవి
ఎన్‌టీఏ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్న అడ్మిట్ కార్డు, ఆధార్ లేదా పాన్ లేదా పాస్‌పోర్ట్ లేదా స్టూడెంట్ ఐడీ వంటి ఒరిజినల్ ఫొటో గుర్తింపు కార్డు, రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు, ఒక పోస్ట్‌కార్డ్ సైజ్ ఫొటోను అభ్యర్థులు వెంట తెచ్చుకోవాలి. పారదర్శకమైన వాటర్ బాటిల్‌కు మాత్రమే అనుమతి ఉంటుంది.
ముందుగానే చూసుకోవాలి
నీట్ పరీక్ష సజావుగా నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశాం. అభ్యర్థులు తమ పరీక్ష కేంద్రానికి సంబంధించిన చిరునామాను ముందురోజే చూసుకోవడం మంచిది. అరగంటకు ముందే కేంద్రానికి చేరుకునేలా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలి.
– ప్రతీక్ జైన్, కలెక్టర్, సంగారెడ్డి


