పుట్టగొడుగుల్లా అక్రమ షెడ్లు | - | Sakshi
Sakshi News home page

పుట్టగొడుగుల్లా అక్రమ షెడ్లు

May 2 2026 12:01 PM | Updated on May 2 2026 12:01 PM

జిన్నారం (పటాన్‌చెరు): జిన్నారం, గడ్డపోతారం, గుమ్మడిదల, బొల్లారం ప్రాంతాల్లో ముఖ్యమైన కూడళ్లు ప్రధాన రోడ్లలో ఎక్కడబడితే అక్కడ రేకుల షెడ్లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. ఆ నిర్మాణాలకు సంబంధించి మున్సిపల్‌ అనుమతులు తీసుకోవడం లేదు. చకచకా నిర్మాణాలు చేపట్టి ప్రభుత్వ ఆదాయానికి అక్రమార్కులు గండి కొడుతున్నారు.

కార్యాలయానికి కూతవేటు దూరంలోనే

గడ్డపోతారం పట్టణ పరిధిలోని సర్వే నంబర్‌ 79లో అక్రమ షెడ్ల నిర్మాణం జోరుగా సాగుతోంది. అక్రమాల ముసుగులో షెడ్లను నిర్మిస్తున్నా కనీస చర్యలు చేపట్టడంలో మున్సిపల్‌ అధికారులు ఘోరంగా విఫలమవుతున్నారు. వీటిపై స్థానికుల నుంచి ఫిర్యాదులు అందినా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తూ అక్రమార్కులకు అండగా నిలుస్తున్నారు. మున్సిపాలిటీగా ఏర్పడిన గడ్డపోతారం ప్రగతిపథంలో ముందుకెళ్తోంది. ఇదే క్రమంలో అక్రమార్కులు ప్రధాన కూడళ్లు ముఖ్యమైన ప్రాంతాలు ఎక్కడపడితే అక్కడ వివిధ వ్యాపార వాణిజ్య లావాదేవీలు యథేచ్ఛగా కొనసాగుతున్న ఎవరూ పట్టించుకోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో భారీ మొత్తంలో ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతోంది. అక్రమ షెడ్లకు సంబంధించి ఆస్తి పన్ను రావడంలేదని కట్టడి చేయడంలో నగర ప్రణాళిక రెవెన్యూ విభాగం అధికారులు సిబ్బంది క్షేత్రస్థాయిలో పరిశీలించిన దాఖలాలు లేవు. పట్టణ పరిధిలో ఇటు వాణిజ్య దుకాణాలు నిర్మించే ముందు స్థలం యజమాని అన్ని ధ్రువపత్రాలు సమర్పించి మున్సిపల్‌ అధికారుల నుంచి తప్పనిసరిగా అనుమతులు పొందాలి. ఆ తర్వాతే నిర్మాణ పనులు చేపట్టాల్సి ఉంటుంది. నిర్మాణం పూర్తయ్యాక డోర్‌ నంబర్‌తోపాటు అసెస్మెంట్‌ చేసుకుని ఏటా ఆస్తి పన్ను చెల్లించాలి. ఇందుకు విరుద్ధంగా మున్సిపాలిటీలో కార్యకలాపాలు కొనసాగుతున్నాయి.

క్షేత్రస్థాయిలో తనిఖీలు శూన్యం

అక్రమ షెడ్ల నిర్మాణాలపై అధికారులు ఇప్పటివరకు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేసిన దాఖలాలు లేవు. స్థానికులు ఫిర్యాదులు చేసినా నామమాత్రంగానే స్పందించి వదిలేస్తున్నారు. అధికారుల చర్యలు అక్రమార్కులకు వత్తాసు పలికినట్లుగా ఉన్నాయని స్థానికంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కన్నెత్తి చూడని అధికారులు

అక్రమ నిర్మాణాలతో ఆదాయానికి గండి

Advertisement
 
Advertisement
Advertisement