సమీక్షలో మాట్లాడుతున్న కలెక్టర్
సంగారెడ్డి జోన్: రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా రబీ సీజన్ ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ మాధురితో కలిసి ధాన్యం కొనుగోళ్లపై శుక్రవారం సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలు, ఇప్పటివరకు కొనుగోలు చేసిన ధాన్యం పరిమాణం, ట్యాబ్ ఎంట్రీలు, కేంద్రాల్లో ఏర్పాటు చేసిన సౌకర్యాలు, గన్నీ బ్యాగుల లభ్యత, తేమ కొలిచే యంత్రాలు, రైతుల ఖాతాల్లో జమ అయిన చెల్లింపుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్యాక్స్, డీసీఎంఎస్, ఐకేపీల ద్వారా జిల్లాలో ఇప్పటివరకు మొత్తం 175 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ...అన్ని కొనుగోలు కేంద్రాలను తక్షణమే పూర్తిస్థాయిలో ప్రారంభించాలన్నారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సజావుగా ధాన్యం సేకరణ కొనసాగించాలని సూచించారు. కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ ప్రతీక్ జైన్


