పైన భగభగ.. | - | Sakshi
Sakshi News home page

పైన భగభగ..

May 2 2026 12:01 PM | Updated on May 2 2026 12:01 PM

చెంతన సెగ

ఆర్టీసీ డ్రైవర్ల అరిగోస మండుతున్న ఎండలతో ఉక్కిరిబిక్కిరి

నిత్యం వందల కిలోమీటర్ల మేర డ్రైవింగ్‌ కనీస సౌకర్యాలు లేక అవస్థలు

మండే ఎండలతో బస్సులు నడపలేక ఆర్టీసీ డ్రైవర్లు చెమటలు కక్కుతున్నారు. రోజురోజుకు పెరిగిపోతున్న పగటి ఉష్ణోగ్రతలతో బస్సుల్లో గంటలకొద్దీ డ్రైవింగ్‌ సీట్లో కూర్చోలేక తల్లడిల్లిపోతున్నారు. నిత్యం సుమారు 500 కిలోమీటర్ల మేర బస్సు నడుపుతూ అరిగోస పడుతున్నారు. డ్రైవర్‌ సీటుముందు ఫ్యాన్లు లేక రోజూ 12 గంటలకు పైగా ఏకధాటిగా బస్సును నడిపి అనారోగ్యం పాలవుతున్నారు. అయినా ఉన్నతాధికారులు వారి ఆరోగ్యంపై దృష్టిసారించడంలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. – మెదక్‌జోన్‌

మెదక్‌ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మెదక్‌, నర్సాపూర్‌, సిద్దిపేట, గజ్వేల్‌ –ప్రజ్ఞాపూర్‌, దుబ్బాక, సంగారెడ్డి, జహీరాబాద్‌, నారాయణఖేడ్‌ డిపోలు ఉన్నాయి. వీటి పరిధిలో 611 బస్సులు ఉన్నాయి. వీటిలో 144 ఆర్టీసీ బస్సులు, 160 అద్దెబస్సులు, 186 పల్లెవెలుగులు, 59 డీలక్స్‌లు, 18 సూపర్‌ లగ్జరీలు 50 ఎక్స్‌ప్రెస్‌లు ఉండగా ఎనిమిది డిపోల పరిధిలో 774 మంది డ్రైవర్లు, 980 మంది కండక్టర్లు ఉన్నారు. బస్సుల సంఖ్యతో పోలిస్తే కేవలం 163 మంది మాత్రమే డ్రైవర్లు అదనంగా ఉన్నారు. కాగా పల్లెవెలుగులు నిత్యం 350 నుంచి 400 కిలోమీటర్లు తిరుతుగుతుండగా, ఎక్స్‌ప్రెస్‌లు, లగ్జరీలు, 500 కిలో మీటర్లకు పైగా నడపాల్సి ఉంటుందని డ్రైవర్లు చెబుతున్నారు. సూపర్‌లగ్జరీలు లాంగ్‌టూర్లకు వెళ్తుండగా అందులో ఇద్దరు డ్రైవర్లు ఉంటారు. కాగా సూపర్‌ లగ్జరీలలో తప్ప మిగతా ఏబస్సుల్లోనూ డ్రైవర్‌ సీట్లముందు ఫ్యాన్లు లేకపోవడం గమనార్హం.

కుంపట్లో కూర్చున్న విధంగా...!

ఇరవై రోజులుగా ఎండల తీవ్రత అధికంగా ఉంది. జిల్లాలో 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటుతుండటంతో బయట కాలు పెట్టాలంటేనే జనం జంకుతున్నారు. ఇలాంటి వేళ ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ తిప్పలు అన్నీఇన్నీ కావు. బస్సు పైకప్పు ఇనుప రేకులతో తయారు చేసినవి కావటంతో ఎండవేడిమి మరింత అధికంగా ఉంటుంది. అంతే కాకుండా డ్రైవర్‌సీటు పక్కనే ఇంజన్‌వేడి.. నిత్యం 12 గంటలకు పైగా ఏకధాటిగా బస్సును నడపటంతో డ్రైవర్లు నీరసించి పోతున్నారు. గతంలో బస్సు డ్రైవర్‌ సీటు ముందు చిన్నపాటి ఫ్యాన్‌ ఉండేది. కొంత మేర ఉపశమనం పొందుతూ బస్సులను నడిపేవారు. వాటిని చాలా కాలంగా తొలగించటంతో గత్యంతర లేక బతుకు జీవుడా అంటూ డ్రైవింగ్‌ చేస్తున్నారు. ఇక ట్విమ్‌డ్రైవర్ల పరిస్థితి మరీ అధ్వానమనే చెప్పాలి.

ఫ్యాన్లు ఏర్పాటు చేయాలి

ఆర్టీసీ బస్సుల్లో డ్రైవర్‌ సీటుముందు చిన్నపాటి ఫ్యాన్‌ ఏర్పాటు చేయాలని డ్రైవర్లు కోరుతున్నారు. ఫ్యాన్లు లేక పోవటంవల్లా ఎండవేడిమి, ఉక్క పోతతో తరుచూ అనారోగ్యం బారిన పడాల్సి వస్తోందని పలువురు డ్రైవర్లు చెబుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement