రామాయంపేట(మెదక్): ఎంతటివారైనా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్ హెచ్చరించారు. పట్టణానికి చెందిన మైనార్టీ, ఇతర పార్టీలకు చెందిన కార్యకర్తలు కాంగ్రెస్‌లో చేరారు. ఈసందర్భంగా శుక్రవారం నార్సింగి మండలం జప్తిశివునూర్ శివారులో జరిగిన కార్యక్రమంలో పాల్గొని పాల్గొన్నారు. జిల్లాలో గత 25 ఏళ్లగా పార్టీ గెలుపొందలేదని, పార్టీ అభ్యర్థులు గతంలో డిపాజిట్ సైతం కోల్పోయారని పేర్కొన్నారు. పార్టీ రాష్ట్ర నాయకుడు మైనంపల్లి హన్మంతరావు మాట్లాడుతూ ప్రతి కార్యకర్త పార్టీ శ్రేయస్సుకు పాటు పడాలని పిలుపునిచ్చారు. కష్టపడి పనిచేసేవారికే ప్రాధాన్యం ఇస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ లావణ్య, వైస్ చైర్‌పర్సన్ నవనీత, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.
పటాన్‌చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రుద్రారం గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ రసాయన శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థిని నగరపు లక్ష్మీకుమారి డాక్టరేట్‌కు అర్హత సాధించారు. ‘క్లోఫరాబైన్, డెసిటాబైన్, బెలినోస్టాట్, బోర్టెజోమిబ్ తయారీలో కీలక మధ్యస్థ పదార్థాలు, క్రియాశీల ఔషధ పదార్థాల (ఏపీఐ) సంశ్లేషణకు అధునాతన విధానాల’పై ఆమె అధ్యయనం చేసి, సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు. ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న రసాయన శాస్త్ర విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ చిత్తలూరి సుధాకర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా గీతం అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు, రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్‌ఆర్ వర్మ, స్కూల్ ఆఫ్ సైన్స్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.రెజా, రసాయన శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ గౌసియాబేగం, పలు విభాగాల అధిపతులు అభినందించారు.
సంగారెడ్డి: ఆరుబయట చెత్త పారబోసిన వారితోనే తొలగింపజేశారు మున్సిపల్ అధికారులు. శుక్రవారం సంగారెడ్డి పట్టణంలో కొందరికి ‘చెత్త శుద్ధి‘ లేకపోవడంతో రోడ్డుపై ఎక్కడపడితే అక్కడ పారవేస్తున్నారు. దీనిపై విసుగు చెందిన మున్సిపల్ అధికారులు వినూత్న శిక్షకు నడుం బిగించారు. ఎక్కడైతే చెత్తను రోడ్డుపై పారబోశారో వారిని నేరుగా పిలిపించి తీయించారు. చెత్త బయట వేయొద్దని ఎన్నిసార్లు చెప్పినా షాప్ యజమానులు వినకపోవడంతో మున్సిపల్ అధికారులు విసుగు చెంది ఈ పద్ధతిని ఎంచుకున్నారు. శానిటరీ ఇన్‌స్పెక్టర్, జవా న్లు పట్టణంలోని అన్ని రోడ్లు కలియ తిరుగుతూ రోడ్డుపై చెత్త వేసిన షాపు యజమానులతోనే అదే చెత్తను తీసి వేయించారు. వినకపోతే భారీ మొత్తంలో జరిమానా విధిస్తామని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు.
నర్సాపూర్‌లో కలకలం
నర్సాపూర్: ఓ శీతల పానీయంలో కలిపే నీళ్లలో మూత్రం పోశాడని శుక్రవారం నర్సాపూర్‌లో కలకలం రేపింది. పట్టణంలోని మెయిన్ రోడ్డుపై ఓ వ్యక్తి లస్సీ సెంటరు నిర్వహిస్తున్నాడు. అతని ఇంటి పక్కన ఉండే బాలుడు లస్సీ సెంటరు వద్దకు రాగానే ఎదురుగా ఉన్న ట్యాంకు వద్దకు వెళ్లి డబ్బాలో నీళ్లు నింపుకొని రమ్మని బాలుడిని పంపాడు. అతను ట్యాంకు నల్లా నుంచి నీళ్లు నింపుతూ డబ్బాలో మూత్రం పోయడాన్ని ట్యాంకు ఎదురుగా ఉన్న దుకాణాదారులు గమనించి నిలదీయగానే బాలుడు అక్కడి నుంచి లస్సీ సెంటర్‌కు పరుగులు తీశాడు. కాగా డబ్బాలో నీళ్లు నింపుతూ మూత్రం పోశాడని అవే నీళ్లను లస్సీలో కలిపి అమ్మితే ఎలా తాగాలని దుకాణదారులు లస్సీ సెంటరు నిర్వాహకుడిని నిలదీయడంతో సెంటరు వద్ద ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఈ విషయమై ఎస్‌ఐ రంజిత్‌రెడ్డితో ప్రస్తావించగా ఇద్దరికి కౌన్సెలింగ్ ఇస్తామని చెప్పారు.


