● దాదాపు 200 చెట్లకు నష్టం
● అప్రమత్తతతో తప్పిన భారీ నష్టం
● మీనాజీపేటలో ఘటన
వర్గల్(గజ్వేల్): వర్గల్ మండలం మీనాజీపేట శివారు ఈత వనంలో మంటలు చెలరేగాయి. శుక్రవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. దాదాపు 200 చెట్లు దెబ్బతిన్నాయి. ప్రాథమిక దశలోనే మంటలు గుర్తించి అప్రమత్తం కావడంతో భారీ నష్టం తప్పింది. ఘటన స్థలానికి గజ్వేల్ అగ్నిమాపక శకటం చేరుకుని మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చింది. వివరాలు.. మీనాజీపేట శివారులోని రెండున్నర ఎకరాలలో గ్రామ గౌడసంఘం 2,600 మొక్కలు నాటి ఈత వనం పెంచింది. ప్రస్తుతం వాటి ద్వారా ఆదాయం సమకూరుతున్నది. శుక్రవారం గీతకార్మికులు సత్యనారాయణగౌడ్, కిషోర్‌గౌడ్ వనంలో చెట్లు గీసేందుకు వచ్చారు. పొగలు, మంటలను గమనించారు. వెంటనే అందరినీ అప్రమత్తం చేశారు. అంతా కలిసి నీళ్లు చల్లుతూ మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తూనే, గజ్వేల్ అగ్నిమాపక కేంద్రానికి సమాచారం చేరవేశారు. వెంటనే ఫైర్ ఆఫీసర్ శ్రీనివాస్‌రెడ్డి బృందం అగ్నిమాపక శకటంతో ఘటనాస్థలానికి చేరుకుని వనంలో మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చి ఆర్పేశారు. సకాలంలో ప్రమాదాన్ని గుర్తించి అదుపులోకి తేవడం వల్ల మిగతా వనంలోకి మంటలు విస్తరించకుండా ఆపగలిగామని, లేకుంటే భారీ నష్టం జరిగేదని గౌడసంఘ సభ్యులు పేర్కొన్నారు. అగ్నిప్రమాదం కారణంగా దాదాపు 200 చెట్లు దెబ్బతిన్నాయని, రూ. 2 లక్షల మేర నష్టం వాటిల్లిందని తెలిపారు.


