● చీడ పీడల నివారణే లక్ష్యం
● సేంద్రియ ఎరువులు వాడాలి
● వ్యవసాయ అధికారుల సూచనలు
మునిపల్లి(అందోల్): వేసవిలో నేలను బాగా లోతుగా దుక్కి చేస్తే రైతులు అనేక ప్రయోజనాలను పొందవచ్చని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ వస్తున్న సమయంలో వ్యవసాయ భూములను లో దుక్కుల కోసం ట్రాక్టర్లతో దున్నేస్తున్నారు. ఎండలకు నేల వేడెక్కుతోంది. ఈ క్రమంలో నేలను బాగా లోతుగా దుక్కి చేసుకోవాలంటున్నారు. వేసవిలో నేలను బాగా దుక్కి చేస్తే కలుపు మొక్కలు వేర్లతో సహాయ పడి ఎండి నశిస్తాయి. భూమి పొరల్లో ఉన్న చీడ పురుగుల గుడ్లు, కోశాలు బయటపడి ఎండకు చనిపోతాయి, లేదా పక్షులు తీనేస్తున్నాయి. దీంతో పంటలు సాగు చేసినప్పుడు చీడపురుగుల బెడద పంటకు తప్పుతుంది. వాలుకు అడ్డంగా, ఏటవాలుగా దుక్కి చేసుకోవడం ద్వారా వర్షం కురిసినప్పుడు నీరు భూమిలోకి ఇంకుతుంది. తద్వారా నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం పెరుగుతోంది. తేమలో జీవించే వానపాముల సంతతి వృద్ధి చెందుతోంది. ఇవి భూసార పరిరక్షణకు దోహద పడుతాయి. అలాగే వ్యవసాయ భూమిని దుక్కి చేసే ముందు పశువుల పేడ వర్మి కంపోస్టు ఎరువుగా మారి భూమిని సారవంతం చేస్తుంది.


