ఆధునిక పద్ధతుల్లో అధిక దిగుబడులు | - | Sakshi
Sakshi News home page

ఆధునిక పద్ధతుల్లో అధిక దిగుబడులు

May 2 2026 11:55 AM | Updated on May 2 2026 11:55 AM

సదాశివపేట రూరల్‌(సంగారెడ్డి): రైతులు ఆధునిక సాగు పద్ధతులు అనుసరించడంతో అధిక దిగుబడులను సాధించవచ్చని మండల వ్యవసాయాధికారి రమేష్‌ అన్నారు. శుక్రవారం మండలంలోని మాచిరెడ్డిపల్లిలో సర్పంచ్‌ మోహన్‌ గౌడ్‌ అధ్యక్షతన రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు రైతు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పంటల సాగులో పంట మార్పిడి పద్ధతులను పాటించి సుస్థిర ఆదాయాన్ని పొందాలన్నారు. తక్కువ యూరియా వాడకంతో సాగు ఖర్చు తగ్గించుకోవాలని రైతులకు సూచించారు. అవసరం మేరకు మాత్రమే రసాయనాలను వాడాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ మోహన్‌ గౌడ్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ రేవతి, వ్యవసాయ విస్తరణాధికారులు, రైతులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

పంట మార్పిడితో ప్రయోజనం

రాయికోడ్‌(అందోల్‌): పంట మార్పిడి పద్ధతులతో రైతులు అధిక దిగుబడులు సాధించవచ్చని వ్యవసాయ శాస్త్రవేత్తలు వాణీశ్రీ, నీలిమ అన్నారు. మండలంలోని కర్చల్‌లో శుక్రవారం ఏఓ సారికతో కలిసి రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎరువులను సమర్థవంతంగా వినియోగించుకోవాలని రైతులకు సూచించారు. జీవన ఎరువుల ప్రాముఖ్యత, పెట్టుబడులు, మట్టి పరీక్షల ప్రాధాన్యతలపై అవగాహన కల్పించారు. పత్తి పంటలో సమగ్ర యాజమాన్య పద్ధతులను వివరించారు. డ్రోన్‌ స్ప్రేయర్లతో కలిగే ప్రయోజనాలను వివరించారు. అనంతరం ప్రభుత్వ సాగు సూచనలకు సంబంధించిన కరపత్రాలను రైతులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఓ సారిక, ఏఈఓ నవీన్‌, ఆత్మ ఏటీఎం రమేష్‌, మాజీ సర్పంచ్‌లు శ్రీనివాస్‌రెడ్డి, చంద్రశేఖర్‌, రైతులు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement