పటాన్‌చెరు టౌన్: తల్వార్‌తో దాడి చేసిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన సంఘటన అమీన్‌పూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. క్రైమ్ సీఐ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. బీరంగూడ అంబేద్కర్ కాలనీకి చెందిన పుట్టగడ్డల రత్నయ్య అలియాస్ జీవరత్నం ఏప్రిల్ 25వ తేదీ రాత్రి తన ఇంట్లో కిరాయికి ఉండే రాజు బైక్‌పై సమీపంలో ఉన్న సాయి కర్రీ పాయింట్‌కు వెళ్లాడు. అక్కడ రూ.10కి కర్రీ పార్సిల్ ఇవ్వాలని కోరగా.. దుకాణంలోని వ్యక్తులు రూ.30 అవుతుందని తెలిపారు. దీంతో మేము లోకల్, రూ.10కే ఇవ్వాలంటూ వాగ్వాదానికి దిగాడు. మాటా... మాటా పెరిగి గొడవకు దారి తీసింది. ఆ తర్వాత ఆవేశంతో రత్నయ్య, దుకాణంలోకి వెళ్లి షట్టర్ మూసి, లోపల ఉన్న వారిని బెదిరిస్తూ తల్వార్‌తో దాడి చేశాడు. కౌంటర్ వద్ద ఉన్న ఉదయ్ భాను తలపై దాడి చేయడంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో బాధితుడు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో రత్నయ్య అలియాస్ జీవరత్నంను పోలీసులు ఇంటి వద్ద పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా దాడి పాల్పడిన తల్వార్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిని రిమాండ్ తరలించారు. ఎస్‌ఐ రామాంజనేయులు, సిబ్బంది పాల్గొన్నారు.


