తప్పిన పెను ప్రమాదం
వట్‌పల్లి(అందోల్): మండల పరిధిలోని బిజిలీపూర్‌లో శుక్రవారం ఓ వాహనంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అల్లాదుర్గ్ మండలంలోని చిల్వర గ్రామస్తులు తుఫానులో బిజిలీపూర్‌లో జరిగిన ఓ శుభకార్యానికి హాజరయ్యారు. ఈ వాహనాన్ని గ్రామ సమీపంలోని ఖాళీ ప్రదేశంలో పార్కింగ్ చేశారు. అంతలోనే వాహనంలో మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు పోలీసులతో పాటు జోగిపేట ఫైర్ సిబ్బందికి సమాచారం అందించగా.. ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. అయితే అప్పటికే వాహనం పూర్తిగా కాలిపోయింది. వాహనంలో పెద్ద ఎత్తున చెలరేగిన మంటలను చూసి గ్రామస్తులు ఆందోళనకు గురయ్యారు. మంటలు చెలరేగిన సమయంలో వాహనంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలను సేకరించారు.


