అదనపు డీసీపీ కుశాల్కర్
సిద్దిపేటజోన్: మహిళలకు గౌరవం లభించినప్పుడే నిజమైన అభివృద్ధి అని అదనపు డీసీపీ కుశాల్కర్ అన్నారు. ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా సిద్దిపేట పోలీసు కమిషనరేట్ ఆధ్వర్యంలో సిద్దిపేటలో మహిళా భద్రత పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా అదనపు డీసీపీ అడ్మిన్ కుషాల్కర్, అదనపు డీసీపీ సుభాష్ చంద్రబోస్‌లు హాజరయ్యారు.ఈ సందర్భంగా కుషాల్కర్ మాట్లాడుతూ.. సమాజంలో లింగ వివక్ష తగదన్నారు. మహిళలు రక్షణ చట్టాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సమాజంలో మహిళలు ప్రధానంగా ఎదుర్కొంటున్న బాల్య వివాహాలు, సైబర్, వరకట్న వేధింపుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతి మహిళా తమ హక్కులపై అవగాహన కలిగి ఉండాలన్నారు. మహిళలు ఆపదలో ఉన్నప్పుడు తీసుకునే జాగ్రత్తలు, షి టీమ్స్ సేవలు, డయల్ 100 వినియోగంపై సూచనలు చేశారు. అనంతరం మాదక ద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ చేయించారు.
వెల్దుర్తి(తూప్రాన్): విద్యుదాఘాతానికి గురై ఓ రైతు మృతిచెందాడు. ఈ ఘటన మండలంలోని కుకునూర్‌లో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన గ్యార్ల పోచయ్య(60) నాలుగు రోజుల క్రితం వ్యవసాయ పొలం వద్ద బోర్‌మోటారు నడవకపోవడంతో ట్రాన్స్‌ఫార్మర్ వద్ద విద్యుత్ సరఫరా కోసం ప్రయత్నాలు చేస్తుండగా షాక్ తగిలింది. దీంతో తీవ్రంగా గాయపడిన పోచయ్యను గాంధీ ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ బుధవారం అర్ధరాత్రి మృతిచెందాడు.
చిలప్‌చెడ్(నర్సాపూర్): సీజ్ చేసిన ఇసుకను అధికారులు వేలం వేశారు. మండల పరిధిలోని బండపోతుగల్‌లో అనుమతులు లేకుండా ఇసుక కుప్పలను నిల్వ చేశారు. విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు.. పది రోజులు క్రితం ఇసుక కుప్పలను సీజ్ చేసిన విషయం విదితమే. గురువారం బండపోతుగల్ గ్రామ పంచాయతీ ఆవరణలో తహసీల్దార్ సహాదేవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇసుక వేలంపాటలో చిలప్‌చెడ్ చెందిన ఓ వ్యక్తి రూ. 33 వేలకు కొనుగోలు చేశాడు. నిబంధనలు పాటిస్తూ కొనుగోలు చేసిన ఇసుకను తరలించాలని తహసీల్దార్ సహదేవ్ అన్నారు. అలాగే.. మండలంలో అక్రమ ఇసుక రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామని, అక్రమ ఇసుక రవాణా చేస్తూ పట్టుబడితే వాహనాన్ని సీజ్ చేయడంతో, యాజమానిపై సైతం కేసు నమోదు చేస్తామన్నారు.
మెదక్‌జోన్: హత్యకేసులో నిందితుడికి జీవితఖైదుతో పాటు రూ.5వేల జరిమానా విధిస్తూ జిల్లా న్యాయమూర్తి నీలిమ గురువారం తీర్పు ఇచ్చారని మెదక్ జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. మనోహరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గీత ప్యానల్ ప్రొడక్ట్ కంపెనీలో పనిచేస్తున్న సూరజ్, రజినీదేవి అక్కడే నివసిస్తూ జీవనం సాగించేవారు. వీరి మధ్య వ్యక్తిగత విభేదాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో 2023 నవంబర్ 19న ఆవేశానికి లోనైన సూరజ్, రజినీదేవిని చీరతో గొంతు బిగించి హత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై కంపెనీ ప్రతినిధి ఫిర్యాదు మేరకు మనోహరాబాద్ ఎస్‌ఐ కరుణాకర్ రెడ్డి కేసు నమోదు చేశారు. అప్పటి సీఐ శ్రీధర్ సంఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టి, న్యాయస్థానంలో చార్జిషీట్ దాఖలు చేశారు. నిందితుడే దోషిఅని తేలటంతో జీవితఖైదుతో పాటు జరిమానా విధిస్తూ తీర్పు వెలువడిందని తెలిపారు.


