రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా పట్టివేత
సదాశివపేట(సంగారెడ్డి): ఏసీబీ వలకు మున్సిపల్ ఔట్‌సోర్సింగ్ బిల్ కలెక్టర్ నిఖిల్‌రెడ్డి చిక్కాడు. గురువారం మధ్యాహ్నం పట్టణంలోని ఓ స్టీట్ దుకాణం వద్ద బాధితుడి నుంచి రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పట్టణ పరిధిలోని సదాశివ ఎన్‌క్లేవ్‌లో నివాసం ఉంటున్న వ్యక్తి ఇంటి ఆస్తి పన్ను రూ. 41 వేలు ఉండేది. ప్రస్తుతం రూ. 1,04,000 ఆస్తి పన్ను చెల్లించాలని నోటీస్ రావడంతో బాధితుడు మున్సిపల్ కమిషనర్ శివాజీని అశ్రయించాడు. దీనిపై విచారణ చేయాలని సంబంధిత అధికారులకు ఆయన అదేశించారు. ఔట్ సోర్సింగ్ బిల్ కలెక్టర్ నిఖిల్‌రెడ్డి బాధితుడి ఇంటి వద్దకు వెళ్లి ఇంటి కొలతలు చేసి రూ. 1,04,000 ఆస్తి పన్నులో రూ. 50 వేల కంటే ఎక్కువ తగ్గిస్తానని, తనకు రూ. 35 వేలు ఇవ్వాలని కోరారు. దీంతో బాధితుడు డబ్బులు ఇచ్చేందుకు అంగీకరించి కొన్ని రోజుల క్రితం రూ. 20,000 వేలు అందజేశాడు. మిగితా డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. దీంతో వారు వల పన్ని పట్టుకున్నారు. నిఖిల్‌రెడ్డిని మున్సిపల్ కార్యాలయానికి తీసుకెళ్లి విచారించిన అనంతరం ఆయన ఇంటిని సోదా చేశారు. శుక్రవారం నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని ఏసీబీ మెదక్ రెంజ్ డీఎస్పీ సుదర్శన్ తెలిపారు. లంచం కేసులో బిల్ కలెక్టర్ పాత్ర మాత్రమే ఉందా..? ఇతర అధికారులు ఉన్నారా? అనే కోణంలో విచారణ చేపట్టారు.


