జీఐతో పెరిగే! | - | Sakshi
Sakshi News home page

జీఐతో పెరిగే!

May 1 2026 4:04 AM | Updated on May 1 2026 4:04 AM

● శతాబ్దం క్రితం నుంచి గ్రామంలోసాంప్రదాయకంగా వేస్తున్న పంట ● సాగుకు ముందుకువచ్చేరైతులకు ప్రభుత్వం ప్రోత్సాహం

చేమదుంప సాగు..
సజ్జాపూర్‌ దుంపకు జీఐ రిజిస్ట్రీ ఆమోదం
● శతాబ్దం క్రితం నుంచి గ్రామంలోసాంప్రదాయకంగా వేస్తున్న పంట ● సాగుకు ముందుకువచ్చేరైతులకు ప్రభుత్వం ప్రోత్సాహం

జహీరాబాద్‌: గత శతాబ్ద కాలంగా సాంప్రదాయకంగా సాగు చేస్తున్న సజ్జాపూర్‌ చేమదుంపకు జీఐ రిజిస్ట్రీ ఆమోదం లభించడంతో ఈ ప్రాంతంలో ఆ పంట సాగు పెరగనుంది. కోహీర్‌ మండలంలోని సజ్జాపూర్‌ గ్రామంలో ప్రతి ఏటా రైతులు చేమదుంప పంటను సాగుచేస్తూ వస్తున్నారు. ఈ గ్రామంలో సాగవుతున్న చేమదుంప పంట నాణ్యవంతమైనది కావడంతో భౌగోళిక సూచిక(జీఐ) నమోదులో కీలక పురోగతిని సాధించింది. గ్రామంలో పండించే ఈ ప్రత్యేక రకం చేమదుంపకు సంబంధించిని జీఐ దరఖాస్తును చైన్నె జీఐ రిజిస్ట్రీ ఇటీవలే ఆమోదించింది. గతేడాది నవంబర్‌లో ఈ దరఖాస్తును తెలంగాణ కౌన్సిల్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ(టీజీసీఓఎస్టీ) పేరిట సమర్పించారు. సజ్జాపూర్‌ చేమదుంప పుట్టుక, ప్రత్యేక లక్షణాలు, జీవరసాయన విశ్లేషణ, డీఎన్‌ఏ ప్రొఫైలింగ్‌, రైతుల సాగు పద్ధతులు వంటి అంశాలపై విస్తృతంగా పరిశోధనలు జరిగాయి. సజ్జాపూర్‌ చేమదుంపకు జీఐ ట్యాగ్‌ వల్ల ఉత్పత్తులకు ప్రత్యేక గుర్తింపు లభించనుంది. అంతేకాకుండా అధిక ధర లభించడంతోపాటు ఎగుమతి అవకాశాలు పెరగనున్నాయి.

రసాయన ఎరువులు లేకుండా...

సజ్జాపూర్‌లో చేమదుంప పంటను ఎలాంటి రసాయన, పురుగు మందుల పిచికారీ చేయాల్సిన అవసరం లేకుండానే సాగుచేస్తున్నట్లు రైతులు చెబుతున్నారు. ఒక దశలో గ్రామంలో ఐదు వందల ఎకరాల వరకు పంట సాగైంది. ప్రస్తుతం వంద ఎకరాల వరకు పంట సాగులో ఉంది. జీఐ ట్యాగ్‌ లభించడంతో పంట సాగు మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు. తమ గ్రామంలో పండిస్తున్న పంటకు జీఐ ట్యాగ్‌ లభించడం సంతోషంగా ఉందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పంట ఎగుమతులకు అవకాశం లభిస్తే గ్రామమంతా ఇదే పంటసాగు వైపు ఆసక్తి చూపుతామంటున్నారు. ఇటీవల కాలంలో గిట్టుబాటు ధర లభించక పోవడం వల్లే పంట సాగు విస్తీర్ణంపై ప్రభావం పడిందంటున్నారు. జూన్‌లో పంటను సాగు చేసుకుంటే నవంబర్‌లో చేతికి అందివస్తుంది.

ఎకరాకు 80 నుంచి 100 క్వింటాళ్లు

సారవంతమైన నేలలో ఎకరాకు 80 నుంచి 100 క్వింటాళ్ల వరకు దిగుబడులు వస్తాయి. ప్రస్తుతం మార్కె ట్లో క్వింటాల్‌ ధర రూ.1,500 పలుకుతోంది. ఈ పంటను రెండు కాలాల్లో అనగా వర్షాకాలం, చలి కాలాల్లో సాగు చేసుకోవచ్చు.

పోషకాల గని

చేమదుంపలో అనేక పోషకాలు ఇమిడి ఉన్నాయి. వీటిలో ఫైబర్‌, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్‌ సి, ఈ, మెగ్నీషియం అధికంగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో, జీర్ణక్రియను మెరుగుపర్చడంలో, బరువు తగ్గడంలో సహాయ పడతాయి. క్యాన్సర్‌ నిరోధక శక్తిని పెంపొందించడానికి, కంటి చూపును మెరుగు పరచడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. కంటి చూపును మెరుగుపరచడంలోనూ సహాయ పడుతుంది.

Advertisement
 
Advertisement
Advertisement