● ఖేడ్ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శికి ఎమ్మెల్యే సంజీవరెడ్డి వినతి ● వివాహ వేడుకకు హాజరైన సీఎస్‌కుఘన స్వాగతం
నారాయణఖేడ్: ఖేడ్ అభివృద్ధి కోసం రూ.240కోట్లు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావుకు ఎమ్మెల్యే సంజీవరెడ్డి విజ్ఞప్తి చేశారు. సీఎస్ కె.రామకృష్ణారావు తమ బంధువుల వివాహ వేడుకలో పాల్గొనేందుకు గురువారం నారాయణఖేడ్‌కు వచ్చారు. స్థానిక ఆర్‌అండ్‌బీ శాఖ అతిథిగృహం వద్ద ఎమ్మెల్యే సంజీవరెడ్డి, సబ్ కలెక్టర్ ఉమాహారతి ఆయనకు ఘనస్వాగతం పలికి శాలువాలతో సన్మానించారు. అనంతరం అతిథిగృహంలో ఆయనతో ఎమ్మెల్యే సమావేశమై మనూరు మండలం రాయిపల్లి వద్ద మంజీరా నదిపై ఉన్న వంతెన బ్రిడ్జి కండ్యాంగా మార్చేందుకు రూ.125 కోట్లు, ఖేడ్ పట్టణంకు రింగు రోడ్డుకు రూ.70 కోట్లు, ఖేడ్‌లో ఏటీసీ కేంద్రానికి రూ.45 కోట్లు మంజూరు చేసే విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి మంజూరు చేయించాలని కోరారు. ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. వివాహ వేడుకల్లో ఖేడ్ మున్సిపల్ చైర్మన్ నగేశ్ షెట్కార్ రామకృష్ణారావును కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. పలు అభివృద్ధి పనులపై చర్చించారు.
బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో...
సీఎస్ రామకృష్ణారావును బ్రాహ్మణ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వినోద్‌పాటిల్, ఖేడ్ మండల అధ్యక్షుడు బక్షి రవీందర్‌రావు, ఉపాధ్యక్షుడు సురేశ్‌రావు, కోశాధికారి చంద్రకాంత్, వెంకట్‌రావు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాలతో సన్మానంచి జ్ఞాపికను అందజేశారు. బ్రాహ్మణపరిషత్ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని కోరగా సానుకూలంగా స్పందించారు. ఖేడ్ ప్రాంతంలో నెలకొన్న రోడ్లు, తాగునీటి సమస్యలు పరిష్కరించాలని ఖేడ్ మాజీ జెడ్పీటీసీ లక్ష్మిబాయి రవీందర్ నాయక్ కోరారు. సీఎస్‌ను శాలువాతో సత్కరించారు. వివిధ సమస్యలను వివరిస్తూ పరిష్కరించి ప్రాంతాభివృద్ధికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.


