పటాన్‌చెరు/పటాన్‌చెరు టౌన్: నియోజకవర్గ పరిధిలోని ఐదు మున్సిపాలిటీల సమగ్రాభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్నామని..ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను పరుగులు పెట్టించాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి స్పష్టం చేశారు. ఇంద్రేశం, జిన్నారం మున్సిపాలిటీల పరిధిలో గురువారం నిర్వహించిన నూతన కో–ఆప్షన్ సభ్యుల ఎంపిక అనంతరం..మున్సిపల్ పాలకవర్గం సభ్యులతో కలిసి నూతన కో ఆప్షన్ సభ్యులు ఎమ్మెల్యేను మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. తమపై నమ్మకంతో కో ఆప్షన్ సభ్యులుగా ఎన్నికకు సంపూర్ణ సహకారం అందించిన ఎమ్మెల్యేకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..ప్రజలు ఎంతో నమ్మకంతో ఐదు మున్సిపాలిటీలలో బీఆర్‌ఎస్ పార్టీకి పట్టం కట్టారన్నారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు.
అంగన్‌వాడీలకు మొబైల్ ఫోన్ల పంపిణీ
నియోజకవర్గ పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న 153 మంది ఉపాధ్యాయులకు ప్రభుత్వం అందించిన మొబైల్ ఫోన్‌లను ఎమ్మెల్యే గూడెం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...అంగన్‌వాడీల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామన్నారు. ఇంద్రేశం మున్సిపల్ చైర్మన్ ప్రమీల, జిన్నారం మున్సిపల్ చైర్మన్ జనార్ధన్, వైస్ చైర్మన్ హరీశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నూతన కో ఆప్షన్ సభ్యులకు
శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే గూడెం


