జోగిపేట(అందోల్): తెలంగాణలో బీఆర్‌ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని ప్రజాగాయకుడు ఎమ్మెల్సీ గోరటి వెంకన్న జోస్యం చెప్పారు. బోధన్‌లో ఒక కార్యక్రమానికి హాజరుకావడానికి వెళ్తూ జోగిపేటలో కొద్దిసేపు ఆగారు. మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ఆయనను శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో ఏ ప్రాంతానికి వెళ్లినా కేసీఆర్‌ను ప్రజలు గుర్తుచేసుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో పాలన ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా సాగుతుం దని చెప్పారు. తెలంగాణ అభివృద్ధి బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలోనే జరిగిందని గుర్తు చేశారు. ఇప్పటి పాలకులు ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చారని ఆ తర్వాత ప్రజలకిచ్చిన మాట మరిచారని విమర్శించారు. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండాలని, కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా పనిచేయాలని క్రాంతి కిరణ్‌కు సూచించారు. పట్టణ మాజీ బీఆర్‌ఎస్ అధ్యక్షుడు చాపల వెంకటేశం, బీఆర్‌ఎస్ నాయకులు ప్రదీప్‌గౌడ్, నర్సింహులు, రమణ, పింటూ తదితరులు ఆయనను కలిసిన వారిలో ఉన్నారు.
ప్రజాగాయకుడు ఎమ్మెల్సీ గోరటి వెంకన్న


