ఉపాధికూలీల అవస్థలు
మెదక్‌జోన్: మెదక్ జిల్లాలో 21 మండలాల పరిధిలో 1.60 లక్షల జాబ్‌కార్డులు ఉండగా, వీటి పరిధిలో 3.20 లక్షల మంది కూలీలు ఉన్నారు. ప్రస్తుతం ప్రతిరోజూ జిల్లాలో 33 వేల మంది పైచిలుకు కూలీలు పనులు చేస్తున్నారు. ఒక్కో కుటుంబానికి 100 రోజులు పనులు సొంత ఊరిలోనే కల్పించి ఉపాధి చూపించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఎన్‌ఆర్‌ఈజీఎస్ పథకాన్ని ప్రారంభించింది.
రెండు నెలలుగా కూలీ డబ్బుల్లేవు..
పొట్టకూటి కోసం మండే ఎండను లెక్క చేయకుండా ప్రతిరోజూ 33 వేల మంది కూలీలు ఉపాధిపనులు చేస్తున్నారు. కాగా వీరికి రెండు నెలలుగా కూలీడబ్బులు రావడం లేదు. దీంతో ఫూట గడవక ఇబ్బందులు పడుతున్నామని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులను అడిగితే ఇస్తామని కాలం వెళ్లదీస్తున్నారని కూలీలు వాపోయారు. గతంలో వారం, పదిరోజుల కోసారి డబ్బులు వచ్చేవని, ఇప్పుడు రెండు నెలలైనా ఇవ్వటం లేదని మండిపడుతున్నారు.
అరకొర వసతులు
పదిహేను రోజులుగా ఎండల తీవ్రత విపరీతంగా పెరిగింది. ప్రస్తుతం పగటి ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలు దాటింది. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు భానుడు భగ్గున మండిపోతున్నాడు. కాగా పని చేసేచోట కూలీలకు నీడ కోసం టెంట్లు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్ల పంపిణీ, తాగునీటి వసతి కల్పించడంతో పాటు మెడికల్ కిట్లు సైతం అందుబాటులో ఉంచాలి. కానీ సంబంధిత అధికారులు ఈ బాధ్యతలను ఆయా పంచాయతీ కార్యదర్శులకు అప్పగించి చేతులు దులుపుకున్నారు. కొన్ని గ్రామాల్లో టెంట్లు ఏర్పాట్లు చేయగా, చాలా గ్రామాల్లో టెంట్లు కాదు కదా కనీసం తాగునీటిని సైతం ఇవ్వడం లేదు. దీంతో కూలీలే ఇళ్లనుంచి తాగునీటిని తీసుకెళ్తున్నారు.
వడదెబ్బతో చస్తున్నా.. పట్టించుకోరా?
జిల్లాలో నిత్యం 33 వేలమంది పనులకు..
రెండు నెలలుగా అందని కూలీ డబ్బులు
టెంట్లు వేయాలని ఆదేశించాం
ఉపాధిహామీ పనులు చేసే ప్రతి గ్రామంలో కూలీలకు నీడ కోసం టెంట్లు వేసి, తాగునీటిని అందుబాటులో ఉంచాలని గ్రామ పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేశాం. చాలా గ్రామాల్లో వసతులు ఏర్పాటు చేసినట్లు నా దృష్టికి వచ్చింది. ఎక్కడైనా టెంట్లు వేయకుంటే వెంటనే వేయిస్తాం.
– శ్రీనివాసరావు, డీఆర్‌డీఓ, మెదక్


