కారు, బైక్ ఢీ.. ఒకరు మృతి
చిలప్‌చెడ్(నర్సాపూర్): రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందగా, అతడి సోదరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మండలంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్‌ఐ నర్సింహులు వివరాల ప్రకారం... చిలప్‌చెడ్ గ్రామానికి చెందిన శాతరి పరశురాం(25), తన సోదరి రేణుకతో కలిసి బైక్‌పై చిట్కుల్ చౌరస్తా నుంచి చిలప్‌చెడ్‌కు వెళ్తున్నాడు. చండూర్ గ్రామ శివారుకు రాగానే జోగిపేట పట్టణానికి చెందిన ఎన్నం హరీశ్ కారులో జోగిపేట వైపు వస్తూ బైక్‌ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో పరశురాం మెడకు, తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. రేణుకకు కాలు విరగడంతో పాటు తలకు గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆమె ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. హరీష్ వేగంగా, నిర్లక్ష్యంగా కారు నడపడంతోనే ప్రమాదం జరిగిందని, మృతుడి తండ్రి శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.


