ఆర్టీసీ ఎండీని కలిసిన జేఏసీ నాయకులు | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ ఎండీని కలిసిన జేఏసీ నాయకులు

Apr 30 2026 9:30 AM | Updated on Apr 30 2026 9:30 AM

ఆర్టీసీ ఎండీని కలిసిన జేఏసీ నాయకులు స్టోర్‌ రూమ్‌లో అగ్ని ప్రమాదం దాడికి పాల్పడిన వ్యక్తులకు జరిమాన

గజ్వేల్‌రూరల్‌: తెలంగాణ ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డిని గజ్వేల్‌–ప్రజ్ఞాపూర్‌(జీపీపీ) ఆర్టీసీ జేఏసీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జీపీపీ ఆర్టీసీ జేఏసీ చైర్మన్‌ జక్కుల నర్సింహులు, సీనియర్‌ నాయకులు కేఎం రెడ్డి బుధవారం కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి కృషి చేయడంపై ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశామన్నారు. ఈ కార్యక్రమంలో జీపీపీ ఆర్టీసీ డిపో జేఏసీ నాయకులు పాల్గొన్నారు.

హత్నూర(సంగారెడ్డి): మండలంలోని దౌల్తాబాద్‌ ప్రాథమిక పాఠశాలలో అగ్నిప్రమాదం సంభవించింది. స్టోర్‌ గదిలో బుధవారం సాయంత్రం ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా వారు వచ్చి మంటలను ఆర్పేశారు. శిథిలావస్థకు చేరిన పాఠశాల భవనంలోని గదిలో పాత పుస్తకాలు, తదితర సామగ్రి ఉండటంతో అగ్రిప్రమాదంలో కాలిపోయాయని స్థానికులు తెలిపారు.

గజ్వేల్‌రూరల్‌: భూ వివాదంలో ఓ కుటుంబంపై దాడికి పాల్పడిన నలుగురికి కోర్టు జరిమానా విధించింది. గజ్వేల్‌ సీఐ రవికుమార్‌ వివరాల ప్రకారం... మండల పరిధిలోని దాతర్‌పల్లికి చెందిన జాంగితి నర్సింహులు, అతని కుటుంబ సభ్యులు తమ వ్యవసాయ భూమికి వెళ్లే బాట విషయంలో అక్కారం గ్రామానికి చెందిన గౌలికార్‌ జనార్దన్‌ కుటుంబంతో వివాదం ఏర్పడింది. దీంతో గతంలో అమ్మిన భూమికి సంబంధించిన దారిని జనార్దన్‌ ఆక్రమించి కంచె వేయడంతో నర్సింహులు అభ్యంతరం తెలిపాడు. పరిష్కారం కోసం 2015 ఫిబ్రవరి 17న జనార్దన్‌ ఇంటికి వెళ్లిన నర్సింహులు, రమేశ్‌పై కర్రలతో దాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనలో గౌలికార్‌ జనార్దన్‌తో పాటు అతని కుటుంబ సభ్యులు పద్మ, రాజు, రాకేశ్‌ దాడికి పాల్పడినట్లు కోర్టులో నేరం రుజువైంది. ఒక్కొక్కరికి రూ. వెయ్యి చొప్పున జరిమానా విధిస్తూ బుధవారం గజ్వేల్‌ ప్రిన్సిపల్‌ జ్యుడీషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మెజిస్ట్రేట్‌ స్వాతిగౌడ్‌ తీర్పునిచ్చినట్లు పోలీసులు తెలిపారు.

వ్యక్తి మృతికి కారణమైన డ్రైవర్‌కు..

గజ్వేల్‌రూరల్‌: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతికి కారణమైన బస్సు డ్రైవర్‌కు కోర్టు జరిమానా విధించినట్లు గజ్వేల్‌ సీఐ రవికుమార్‌ తెలిపారు. వివరాలు ఇలా... 2015 ఫిబ్రవరి 16న గజ్వేల్‌కు చెందిన విభూతి బస్వరాజు(42) ద్విచక్ర వాహనంపై ప్రజ్ఞాపూర్‌ శివారులోని రాణే కంపెనీలో విధులకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో కరీంనగర్‌ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ కొమురయ్య రాజీవ్‌ రహదారిపై రాంగ్‌రూట్లో వచ్చి బస్వరాజును ఢీకొట్టాడు. ఈ ఘటనలో అతడు మృతి చెందగా, బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై బుధవారం విచారణ చేపట్టిన గజ్వేల్‌ ప్రిన్సిపల్‌ జ్యుడీషియల్‌ మెజిస్ట్రేట్‌ స్వాతిగౌడ్‌ బస్‌ డ్రైవర్‌ కొమురయ్యపై నేరం రుజువైనందున రూ. 8వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement