చికిత్స పొందుతూ కార్మికుడు మృతి | - | Sakshi
Sakshi News home page

చికిత్స పొందుతూ కార్మికుడు మృతి

Apr 30 2026 9:30 AM | Updated on Apr 30 2026 9:30 AM

చికిత్స పొందుతూ కార్మికుడు మృతి విద్యుదాఘాతంతో మహిళ.. దాడి చేసిన వ్యక్తులపై ఫిర్యాదు

పటాన్‌చెరు టౌన్‌: చికిత్స పొందుతూ కార్మికుడు మృతి చెందాడు. ఈ ఘటన పటాన్‌చెరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ రాజు తెలిపిన వివరాల ప్రకారం... పటాన్‌చెరు శాంతినగర్‌ కాలనీలో ఉంటున్న బీహార్‌కు చెందిన వికేశ్‌కుమార్‌ సింగ్‌ (31) ఫెన్నార్‌ పరిశ్రమలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. మంగళవారం మధ్యాహ్నం సమయంలో పరిశ్రమలో షెడ్డుపై రేకులు ఉండే చోట పనిచేస్తుండగా, తాడు తనకు కట్టుకోకపోవడంతో అకస్మాత్తుగా జారిపడ్డాడు. తీవ్రంగా గాయపడటంతో అతన్ని పటాన్‌చెరులోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు బుధవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రామాయంపేట(మెదక్‌): కరెంటు షాకుతో తీవ్రగాయాలైన మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. ఎస్‌ఐ బాల్‌రాజు వివరాల ప్రకారం.. మండలంలోని తొనిగండ్ల గ్రామానికి చెందిన తక్కనోళ్ల సిద్ధవ్వ (50 ) సోమవారం తన ఇంట్లో కరెంటు హీటర్‌తో నీరు వేడి చేస్తున్న క్రమంలో షాక్‌ కొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఆమెను మెదక్‌ ప్రభుత్వ ఆస్పత్రికి, వైద్యుల సూచన మేరకు హైదరాబాద్‌ గాంధీకి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. ఎస్‌ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

జిన్నారం (పటాన్‌చెరు): గడ్డపోతారం పట్టణ పరిధిలోని కాజిపల్లి ధర్మి చెరువు కాలుష్యంపై ప్రత్యేక సమావేశం నిర్వహించడం తట్టుకోలేక కొంతమంది కక్షపూరితంగా దాడి చేసి , ఇంట్లో వస్తువులు ధ్వంసం చేశారని బీఆర్‌ఎస్‌ నాయకుడు, అడ్వకేట్‌ దండే రమాకాంత్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు దాడికి పాల్పడిన వ్యక్తులపై కేసు నమోదు చేశారు. వారి నుంచి రక్షణ కల్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement