ప్రిన్సిపల్
సైంటిస్టు సతీశ్
కొల్చారం(నర్సాపూర్): పంటలు సాగు చేసే ముందు రైతులు తప్పనిసరిగా మట్టి పరీక్షలు చేయించాలని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రిన్సిపల్ సైంటిస్టు సతీశ్ పేర్కొన్నారు. బుధవారం మండలంలోని కిష్టాపూర్ గ్రామంలో ‘రైతుల ముంగిట్లో శాస్త్రవేత్తలు’ అంశంపై రైతులకు పంటల సాగుపై అవగాహన సదస్సు నిర్వహించారు. రైతులను ఉద్దేశించి ప్రిన్సిపాల్ మాట్లాడుతూ... వరిలో నారుమడి, నీటి యాజమాన్య పద్ధతులను పాటించాలన్నారు. సాగుకు ముందు మట్టి పరీక్షలు నిర్వహించడం ద్వారా నేల స్వభావం తెలిసి, అనువైన పంట వేసుకునేందుకు అవకాశం ఏర్పడుతుందన్నారు. సమతుల్య ఎరువుల వినియోగం, జీవ నియంత్రణ పద్ధతులను పాటించాలన్నారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా కొత్తగా రూపొందించిన వరి రకాలను రైతులకు వివరించారు. కార్యక్రమంలో వ్యవసాయ ఆర్థిక శాస్త్రవేత్త రమ్యశ్రీ, ఏఓ శ్వేతాకుమారి, అనుబంధ శాఖల అధికారులు, రైతులు పాల్గొన్నారు.


