తప్పు చేశారని తెలిసినా చర్యలేవీ?
అధికారుల తీరుపై
మండిపడుతున్న గ్రామస్తులు
కొండాపూర్(సంగారెడ్డి): పంచాయతీలకు వచ్చిన నిధులను సక్రమంగా ఖర్చు చేసి గ్రామాన్ని అభివృద్ధి చేయాల్సిన పంచాయతీ కార్యదర్శి కాసుల కోసం కక్కుర్తి పడ్డాడు. ఆ కాసుల కక్కుర్తిలో గ్రామ పాలకవర్గాన్ని భాగం చేశాడు. పని చేయకుండానే బిల్లులు డ్రా చేసినా ఏం కాదంటూ గ్రామ పాలకవర్గాన్ని తప్పుదోవ పట్టించి గ్రామ సర్పంచ్‌తో బిల్లులు డ్రా చేయించాడు. వచ్చిన డబ్బుల్ని పాలకవర్గంతో కలసి స్వాహా చేసేశాడు. గ్రామస్థులు ఈ నెల 10న కలెక్టరేట్‌లోని ప్రజావాణిలో ఫిర్యాదు చేయడంతో ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై డీఎల్‌పీఓ అధికారి ఈ నెల 20న విచారణ చేపట్టి పంచాయతీ రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. తనిఖీ చేసి సుమారు తొమ్మిది రోజులవుతున్నా నేటికీ అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోలేదు. పనిచేయకుండానే బిల్లులు డ్రా చేయడంలో సూత్రధారి...పాత్రధారి సదరు పంచాయతీ కార్యదర్శేనని తెలిసినప్పటికీ అధికారులు ఇప్పటివరకు అతడిపై కూడా చర్యలు తీసుకోకపోవడం పట్ల గ్రామస్థులు మండిపడుతున్నారు.
పీర్ల బావి మరమ్మతు కోసం
గ్రామంలో ఉన్న పీర్ల బావి ప్రమాదకరంగా ఉండటంతో దానిని పూడ్చేందుకు గ్రామ పంచాయతీ నిధులను ఖర్చు చేయాలని పంచాయతీ పాలకవర్గం తీర్మానించింది. ఆలోచన మంచిదే అయినప్పటికీ పనులు పూర్తయ్యాక మాత్రమే బిల్లులను డ్రా చేయాలి. కానీ, మార్చి 31వ తేదీ గడువు దాటిపోతే నిధులు వెనక్కి వెళ్తాయని గ్రామ సర్పంచ్‌తోపాటు పంచాయతీ పాలకవర్గాన్ని తప్పుదోవ పట్టించాడు. దీంతో అనుకున్నదే తడువుగా గ్రామ సర్పంచ్ తమ కుటుంబ సభ్యుల పేరు మీద మార్చి 31న రూ.7 లక్షలను డ్రా చేయించాడు.
అయితే పీర్ల బావికి మరమ్మతుల పేరిట ఈ నిధుల్ని అంతా కలసి స్వాహా చేసేశారు. విషయాన్ని గ్రహించిన గ్రామస్తులు పీర్లబావి మరమ్మతుకు ఎంత కాదనుకున్నా రూ.2లక్షలు కూడా దాటవని మిగిలిన డబ్బులన్నీ పాలకవర్గం కాజేయడానికే నిధుల్ని డ్రా చేసినట్లు గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయాన్ని ఏప్రిల్ 10న గ్రామస్థులు కలెక్టరేట్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో ఈ నెల 20న డీఎల్‌పీఓ అనిత ఈ విషయంపై విచారణ చేపట్టి పంచాయతీ రికార్డులను స్వాధీనం చేసుకున్నారు.
మామూళ్ల మత్తులో అధికారులు
మునిదేవునిపల్లి కార్యదర్శిగా పనిచేస్తున్న కిషోర్‌పై చాలాకాలంగా ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. మండలంలోనే అత్యధికంగా వెంచర్లున్నది ఈ గ్రామంలోనే. వెంచర్లకు ఎలాంటి అనుమతుల్లేకున్నా.. గ్రామ పంచాయతీ అనుమతి మాత్రం ఉంటుంది. మీ దగ్గరకు ఎవరూ రారు. ఎవరొచ్చినా నేను చూసుకుంటానని చెప్తూ ప్రతీ నెల జిల్లా అధికారులకు మామూళ్లు ఇస్తానంటూ రియల్టర్లను బెదిరించడం, వారి నుంచి డబ్బులు వసూళ్లు చేయడం ఆయన నైజం. ఇంతలా అవినీతికి పాల్పడుతున్న కిషోర్‌ను నూతనంగా ఎన్నికై న పంచాయతీ వార్డు సభ్యులకు శిక్షణ ఇచ్చేందుకు ఎంపిక చేయడంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. నూతనంగా ఎంపికై న వార్డు సభ్యులకు పనులు చేయకముందే బిల్లులను ఎలా డ్రా చేయాలో శిక్షణలో నేర్పుతున్నాడా అంటూ ఎద్దేవా చేస్తున్నారు.
డీపీఓకు నివేదికను అందజేస్తా
మునిదేవునిపల్లిలో పనులు చేయకుండానే 15వ ఆర్థిక సంఘం నిధులను డ్రా చేసి మాట వాస్తవమే. ఈ విషయంపై విచారణ చేసేందుకు ఈనెల 20న గ్రామ పంచాయతీకి వెళ్లి రికార్డులను తనిఖీ చేసి, కొన్నింటిని స్వాధీనం చేసుకున్నాం. త్వరలోనే తుది నివేదకను డీపీఓకు అందజేస్తా.
–అనిత, డీఎల్‌పీఓ
పనులు చేయకుండానే బిల్లులు
స్వాహా చేసిన పంచాయతీ కార్యదర్శి


