వ్యవసాయ శాస్త్రవేత్త శ్రీదేవి
సదాశివపేట రూరల్(సంగారెడ్డి): సాగులో పంట మార్పిడి పద్ధతులను పాటించి సుస్థిర ఆదాయాన్ని పొందాలని వ్యవసాయ శాస్త్రవేత్త శ్రీదేవి రైతులకు సూచించారు. మండలంలోని మెలగిరిపేట్‌లో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ విశ్వవిద్యాలయం, వ్యవసాయ శాఖ సంయుక్తంగా రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు శాస్త్రవేత్తలు హాజరై రైతులకు ఆధునిక వ్యవసాయంపై అవగాహన కల్పించారు. యూరియాను పరిమిత మోతాదులో మాత్రమే వినియోగిస్తూ సాగు ఖర్చు తగ్గించుకోవాలని సూచించారు. అవసరం మేరకు మాత్రమే రసాయనాల వినియోగించడం వల్ల నేలసారాన్ని కాపాడుకోవచ్చని తెలిపారు. రైతులు ఎరువుల దుకాణాల్లో కొనుగోలు చేసిన విత్తనాలకు కచ్చితంగా రశీదు తీసుకోవాలని, పంట పూర్తయ్యే వరకు దానిని భద్రపరుచుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏఓ రమేశ్, సర్పంచ్ షాబుద్దీన్, వ్యవసాయ విస్తరణ అధికారులు, రైతులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
మద్దతు ధర కల్పనలో
కీలకపాత్ర
మార్కెట్ కమిటీ చైర్మన్ జగన్మోహన్‌రెడ్డి
జోగిపేట(అందోల్): రైతులకు మద్దతు ధరను కల్పించడంలో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు కీలకపాత్ర పోషిస్తున్నాయని జోగిపేట మార్కెట్ కమిటీ చైర్మన్ జగన్మోహన్‌రెడ్డి తెలిపారు. రైతులు దళారులను ఆశ్రయించకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలని సూచించారు. జోగిపేట గంజ్‌లో మంగళవారం వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని అన్ని సౌకర్యాలతో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని తెలిపారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు పాల్గొన్నారు.
అండర్‌పాస్ వంతెన
నిర్మాణానికి కృషి
ఎంపీ రఘునందన్‌రావు
చిన్నశంకరంపేట(మెదక్): నార్సింగి మండల కేంద్రం నుంచి శాలిపేట గ్రామానికి వెళ్లే రహదారిపై రైల్వేట్రాక్ వద్ద అండర్‌పాస్ బ్రిడ్జి నిర్మాణం కోసం కృషిచేస్తానని ఎంపీ రఘునందన్‌రావు అన్నారు. నార్సింగి సర్పంచ్ సుజాతగౌడ్‌తోపాటు మరో ఎనిమిది గ్రామాల సర్పంచ్‌ల కోరిక మేరకు వంతెన నిర్మాణానికి మంగళవారం స్థలాన్ని పరిశీలించారు. ఆయన రైల్వే డీఆర్‌ఎంతో ఫోన్‌లో మాట్లాడి ప్రతిపాదిత వంతెన గురించి వివరించారు. దానికి ఆయన ఒకటి రెండు రోజుల్లో రైల్వే టెక్నికల్ టీమ్‌ను పంపించి బ్రిడ్జి నిర్మాణానికి నివేదిక రూపొందిస్తామని చెప్పారు. జాతీయ రహదారిపై నిర్మిస్తున్న బ్రిడ్జి గురించి, లైట్ల ఏర్పాటుపై నేషనల్ హైవే అథారిటీ అధికారితో ఫోన్‌లో మాట్లాడారు. తక్షణం లైటింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎంపీ వెంట నార్సింగి సర్పంచ్ సుజాతగౌడ్, శాలిపేట, మడూర్ సర్పంచ్‌లు నారాయణ, దివ్యగౌడ్, ఉప సర్పంచ్‌లు రాజేందర్‌రెడ్డి, కిష్టయ్య, బీజేపీ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు బాబు, మాజీ జెడ్పీటీసీ కృష్ణారెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ మల్లేశంగౌడ్, బీజేపీ నాయకులు సత్యపాల్‌రెడ్డి, లింగారెడ్డి, నర్సింహులు పాల్గొన్నారు.


