కుట్టు యంత్రంతో ఉపాధి మంత్రం | - | Sakshi
Sakshi News home page

కుట్టు యంత్రంతో ఉపాధి మంత్రం

Apr 29 2026 8:30 AM | Updated on Apr 29 2026 8:30 AM

● బలహీనవర్గాల మహిళలకు పంపిణీ ● నియోజకవర్గానికి వెయ్యి.. ● త్వరలో దరఖాస్తుల స్వీకరణ

● బలహీనవర్గాల మహిళలకు పంపిణీ ● నియోజకవర్గానికి వెయ్యి.. ● త్వరలో దరఖాస్తుల స్వీకరణ

నారాయణఖేడ్‌: నైపుణ్యం కలిగిన బీసీ మహిళలకు టైలరింగ్‌ ఆధారిత స్వయం ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు బీసీ మహిళలకు ఆటోమేటెడ్‌ కుట్టు మెషీన్లను పంపిణీ చేయనున్నారు. నియోకవర్గానికి వేయి చొప్పున జిల్లాలోని ఐదు నియోజకవర్గాలకు కలిపి 5 వేల కుట్టు మెషీన్లను ఉచితంగా అందజేయనున్నారు. నైపుణ్యం ఉన్న మహిళలు సరైన ప్రోత్సాహం లేక వెనుకబడిపోతున్న విషయాన్ని గుర్తించిన అధికారులు టైలరింగ్‌ ఆధారిత స్వయం ఉపాధిని కల్పించేందుకు నిర్ణయించారు. వారి ఉత్పాదకతను పెంచి, టైలరింగ్‌ వ్యాపార అవకాశాలను విస్తరించేందుకు, స్వయం సమృద్ధిగల పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు ఆటోమేటిక్‌ కుట్టు మెషీన్లను అందించనున్నారు. వీటిని వందశాతం సబ్సిడీతో ఉచితంగా పంపిణీ చేయనున్నారు.

ఆర్థికంగా ఎదిగే వెసులుబాటు

గ్రామీణ ప్రాంతాల్లో టైలరింగ్‌లో నైపుణ్యం ఉన్న మహిళలున్నా వారికి సరైన ప్రోత్సాహం లేక వెనుకబడి పోతున్నారు. వస్త్రాలు కుట్టడంలో అనుభవమున్నా గ్రామీణ ప్రాంతాల్లో వారి ప్రతిభ వెలికి తీసే పరిస్థితులు లేవు. పేదరికం కారణంగా చాలామంది బలహీన వర్గాల మహిళలు కుట్టు మెషీన్లను కూడా కొనే పరిస్థితి లేదు. నేటికీ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో టైలరింగ్‌పై ఆధారపడి జీవనాన్ని సాగి స్తున్న సంగతి తెలిసిందే. పట్టణ ప్రాంతాల్లో మహిళలు టైలరింగ్‌ వ్యాపార సంస్థల్లో పనిచేస్తూ వారిచ్చే జీతాలతోనే సరిపుచ్చుకుంటున్నారు. వీరికే నేరుగా అధునాతన కుట్టు మెషీన్లు అందజేసి ప్రోత్సహిస్తే ఆర్థికంగా ఎదిగేందుకు అవకాశం ఉంది.

కార్మిక శాఖ ద్వారా...

నాలుగైదేళ్లుగా జిల్లాలో కార్మికశాఖ ద్వారా జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో మహిళలకు కుట్టు శిక్షణ ఇవ్వడంతోపాటు ఉచితంగా మెషీన్లను పంపిణీ చేశారు. జిల్లాలోని నారాయణఖేడ్‌, ర్యాకల్‌, జహీరాబాద్‌, రాత్నపూర్‌, మల్గి, జోగిపేట ప్రాంతంలో మరవెళ్లి, సంగారెడ్డిలోని ఐటీఐ క్యాంపస్‌లో మహిళలకు శిక్షణ ఇచ్చారు. ఒక్కో బ్యాచ్‌లో 30 మంది చొప్పున లేబర్‌ కార్డులు కలిగి ఉన్న మహిళలను గ్రూపులుగా తయారు చేసి ఒక్కో బ్యాచ్‌కు మూడు నెలలపాటు ఉచితంగా కుట్టు శిక్షణ అందజేయడంతోపాటు ఉచితంగా మెషీన్‌, టూల్‌కిట్‌, సర్టిఫికెట్లను అందించారు. కార్మిక శాఖ ద్వారా శిక్షణ పొందిన చాలామంది మహిళలు నేటికీ గ్రామీణ ప్రాంతాల్లో వస్త్రాలు కుట్టి ఉపాధి పొందుతున్నారు.

కలెక్టర్‌ ఆధ్వర్యంలో ఎంపిక

ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెడుతున్న బీసీ మహిళలకు కుట్టు మెషీన్ల పంపిణీకి సంబంధించి త్వరలో దరఖాస్తులు స్వీకరించనున్నారు. వాటిని స్వీకరించి లబ్ధిదారులను కలెక్టర్‌ ఆధ్వర్యంలో ఎంపిక చేయనున్నారు. మార్కెట్‌లో రెడీమేడ్‌ దుస్తులకు డిమాండ్‌ పెరుగుతున్న నేపథ్యంలో ఆటోమేటిక్‌ కుట్టు మెషీన్లు వారి ఉపాధి అవకాశాలను మెరుగు పరిచి ఆర్థిక ఆసరాగా ఎదిగేందుకు ఉపయోగపడనుంది.

Advertisement
 
Advertisement
Advertisement