కలెక్టర్ ప్రతీక్ జైన్
సంగారెడ్డి జోన్/నారాయణఖేడ్: జనగణన ప్రక్రియను సులభంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్వీయగణనను ప్రతీఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు. ఆన్‌లైన్ ద్వారా ప్రజలు తమ వ్యక్తిగత వివరాలు నమోదు చేసుకోవాలన్నారు. కలెక్టరేట్‌లో మంగళవారం కలెక్టర్ స్వీయ నమోదు చేసుకున్నారు. అనంతరం ఖేడ్ మండలంలోని తుర్కాపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ)ని మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. నిర్వహణ విధానాన్ని సమగ్రంగా పరిశీలించారు. రిజిస్టర్లు తనిఖీచేసి ల్యాబ్, ఫార్మసీ విభాగాలను పరిశీలించారు. రోగులు, వైద్య సిబ్బందితో మాట్లాడి వైద్యసేవలు అందుతున్న తీరు, వైద్యులు, సిబ్బంది పాటిస్తున్న సమయపాలన గురించి ఆరా తీశారు. అనంతరం ఖేడ్ సబ్ కలెక్టర్ కార్యాలయంలో నియోజకవర్గంలోని తహసీల్దార్లు, ఎంపీడీఓ, ఆర్‌డబ్ల్యూఎస్, హౌసింగ్, విద్యుత్, మున్సిపల్ తదితర శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...స్వీయగణనకు మే 10వ తేదీ వరకు నమోదు చేసుకునే అవకాశం ఉందన్నారు. సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తూ, సమగ్ర అభివృద్ధి సాధించేందుకు ఎంతగానో దోహదపడే జనగణనలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని సూచించారు. ప్రభుత్వాస్పత్రులకు వచ్చే రోగులకు మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందించడం ద్వారా ప్రజల్లో విశ్వాసం పెంపొందించాలన్నారు. సాధారణ ప్రసవాల సంఖ్య పెరిగేలా కృషి చేయాలని వైద్యులకు సూచించారు. వేసవి దృష్ట్యా గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్లు త్వరగా నిర్మాణం జరిగేలా చూడాలని తెలిపారు. సాదాబైనామాలు, భూభారతి తదితర అంశాల పరిష్కారంపై అధికారులకు కలెక్టర్ వివరించారు. గత వేసవిలో నీటి సమస్య నెలకొన్న ప్రాంతాలను, గ్రామాలను గుర్తించి ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ పాండు, సెన్సస్ డైరెక్టర్ రమాదేవి, స్థానిక సబ్ కలెక్టర్ ఉమాహారతి, మున్సిపల్ కమిషనరు జగ్జీవన్, ఎంపీడీఓ శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


