చేగుంట(తూప్రాన్): రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందింది. ఈ సంఘటన మండలంలోని పులిమామిడి శివారులో సోమవారం రాత్రి చోటు చేసుకుంది.
వివరాలు ఇలా ... మండలంలోని కిష్టాపూర్ గ్రామానికి చెందిన శ్రీదేవి(65) మంగళవారం కిరాణ వస్తువుల కోసం సమీప గ్రామమైన పులిమామిడికి వచ్చింది. వస్తువులు తీసుకొని నడుచుకుంటూ వెళ్తుంది. ఈ క్రమంలో దౌల్తాబాద్ వైపు నుంచి వస్తున్న బైకు శ్రీదేవిని ఢీకొట్టడంతో తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పంచనామ నిర్వహించారు. మృతురాలి భర్త శ్రీనివాసచార్యులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అంత్యక్రియలకు వెళ్లొస్తూ..
కల్హేర్(నారాయణఖేడ్): రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ సంఘటన సోమవారం రాత్రి నిజాంపేట్ మండలంలో చోటు చేసుకుంది. కల్హేర్ ఎస్‌ఐ రవిగౌడ్ వివరాల ప్రకారం... మండలంలోని నాగధర్ గ్రామానికి చెందిన మల్కపూరం కిష్టయ్య(57) ఆటోలో రాపర్తిలో బంధువుల అంత్యక్రియలకు వెళ్లి తిరిగి వస్తున్నాడు. ఈ క్రమంలో మార్గమధ్యలో పల్సర్ బైక్ ఎదురుగా వచ్చి ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటో రోడ్డు పక్కన బోల్తాపడింది. ఆటో నడుపుతున్న కిష్టయ్యకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మరణించాడు. ఆటోలో ఉన్న నాగధర్ గ్రామానికి చెందిన డేవిడ్, బైక్ నడుపుతున్న నితిన్‌రెడ్డికి గాయాలయ్యాయి. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.


