● దగ్ధమైన రెండు కార్లు
● అన్నారంలో ఘటన
జిన్నారం (పటాన్‌చెరు): కారు షెడ్డులో మంటలు చెలరేగి రెండు కార్లు దగ్ధమయ్యాయి. ఈ ఘటన గుమ్మడిదల పట్టణ పరిధిలోని అన్నారంలో చోటుచేసుకుంది. ఎస్సై లక్ష్మీకాంత్ రెడ్డి వివరాల ప్రకారం... అన్నారం గ్రామ సమీపంలోని కారు మెకానిక్ షెడ్డులో మంగళవారం మధ్యాహ్నం బ్యాటరీ చార్జింగ్ పాయింట్ వద్ద షార్ట్ సర్క్యూట్ కారణంగా అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో షెడ్డులోని మెకానికులు, స్థానికులు ఉలిక్కిపడి పరుగులు తీశారు. మంటలు వ్యాపించడంతో షెడ్డులోని మారుతి రిడ్జ్, షిఫ్ట్ డిజైర్ కార్లు పూర్తిగా మంటలకు దగ్ధమయ్యాయి. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సమీపంలోని ఎయిర్ ఫోర్స్ అకాడమీ, హెటిరో పరిశ్రమలకు చెందిన ఫైర్ ఇంజిన్ల సహాయంతో మంటలను పూర్తిగా ఆర్పివేశారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణహాని జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


