కలెక్టర్ ప్రతీక్ జైన్
ప్రజావాణిలో వినతుల స్వీకరణ
సంగారెడ్డి జోన్: ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి వహించాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో అధికారులతో కలిసి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదుల పట్ల సంబంధిత శాఖ అధికారులు పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు మాధురి, పాండు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్‌ను కలిసిన ఎస్పీ, ఉద్యోగులు
నూతన కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన ప్రతిక్ జైన్‌ను ఎస్పీ పరితోశ్ పంకజ్, ఉద్యోగులు కలిశారు. కలెక్టరేట్ లో పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో టీజీవో అధ్యక్షుడు డాక్టర్ డి.వైద్యనాథ్, కమిటీ సభ్యులు సంతోశ్ కుమార్, బలరాం, పర్వతాలు, లలిత కుమారి రామాచారి తదితరులు పాల్గొన్నారు.
రికార్డుల ప్రక్షాళన పేరిట అక్రమాలు
రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి
నారాయణఖేడ్/కంగ్టి(నారాయణఖేడ్): గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం హడావుడిగా చేపట్టిన భూ రికార్డుల ప్రక్షాళనతోనే అనేక అక్రమాలు చోటుచేసుకున్నాయని ఫలితంగా చాలామంది రైతులకు అన్యాయం జరిగిందని రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి ఆరోపించారు. ఖేడ్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. భూ రికార్డుల ప్రక్షాళన సమయంలో కేసీఆర్ రెవెన్యూ మంత్రిగా, కేటీఆర్ ఐటీశాఖ మంత్రిగా ఉండి అమెరికాలోని దివాళాతీసిన కంపెనీకి రికార్డులను, రైతుల ఆధార్, బ్యాంకు ఖాతా వివరాలు అప్పగించగా కేటీఆర్ అగ్రిమెంట్‌పై సంతకం చేశారని గుర్తు చేశారు. భూముల విషయంలో రైతులు గుంట భూమికూడా వదులుకునేందుకు సిద్ధంగా ఉండరని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ధరణిలో లోపాలను సరిదిద్దడానికి భూభారతి చట్టాన్ని అమలులోకి తీసుకువచ్చారని పేర్కొన్నారు. అంతకుముందు కంగ్టి మండలం గాజులపాడ్ గ్రామంలో ఎమ్మెల్యే సంజీవరెడ్డి, సబ్ కలెక్టర్ ఉమాహారతితో కలసి పర్యటించారు. ఈ పర్యటనలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే సంజీవరెడ్డి, కమిషన్ సభ్యులు కేవీఎన్.రెడ్డి, సునీల్ పాల్గొన్నారు.
పంట మార్పిడితో
సుస్థిర ఆదాయం
రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంలో వ్యవసాయ నిపుణులు
వట్‌పల్లి(అందోల్): పంట మార్పిడి పద్ధతితోనే సుస్థిర ఆదాయాన్ని పొందవచ్చని వ్యవసాయ శాస్త్రవేత్తలు డా. వాణిశ్రీ, డా. నీలిమలక్ష్మీ, డా. శాంతి, డా. గీతలు పేర్కొన్నారు. దుద్యాల గ్రామంలో సోమవారం రైతుముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం ద్వారా రైతులకు ఖరీఫ్ సీజన్ పంటల సాగుపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రసాయన ఎరువులు, నీటివినియోగం, పంటల మార్పిడి పద్ధతి, ఆధునిక వ్యవసాయ విధానం, సమగ్ర పంటల నిర్వహణపై రైతులకు అవగాహన కల్పించారు.
గోవును జాతీయ
జంతువుగా ప్రకటించాలి
వినతిపత్రాలు అందజేత
జహీరాబాద్: గోవును జాతీయ జంతువుగా ప్రకటించడంతోపాటు గోవధ నిషేధచట్టం తేవాలని హిందూ సంఘాలు డిమాండ్ చేశాయి. హిందూ సంఘాల ఆధ్వర్యంలో జహీరాబాద్ పట్టణంలోని హనుమాన్ మందిరం నుంచి తహశీల్ కార్యాలయం వరకు సోమవారం గోవులతో ర్యాలీగా వెళ్లి అధికారులకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా హిందూ సంఘాల నాయకులు మాట్లాడుతూ...తమ డిమాండ్లను రాష్ట్రపతి, ప్రధానమంత్రి, గవర్నర్, ముఖ్యమంత్రికి నివేదించాలన్నారు. అంతకుముందు సిద్ధేశ్వర గోశాల నిర్వహకులు గోవులను అలంకరించి పూజలు చేసి నృత్యాలు చేయించారు.


