● పరీక్ష నిర్వహణపై సమీక్ష ● పాల్గొన్న కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ పరితోశ్ పంకజ్
సంగారెడ్డి జోన్: జిల్లాలో నిర్వహించనున్న నీట్ (యూజీ)–2026 ప్రవేశ పరీక్ష సజావుగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం జిల్లాస్థాయి సమన్వయ కమిటీ సమావేశం ఎస్పీ పరితోశ్ పంకజ్‌తో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..మే 3వ తేదీన మధ్యాహ్నం 2.00 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు నిర్వహించనున్న నీట్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ పరీక్షకు 2,772 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. ఇందుకోసం 8 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఉదయం 11.00 గంటల నుంచి మధ్యా హ్నం 1.30 గంటల వరకు మాత్రమే పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారని స్పష్టం చేశారు. బయోమెట్రిక్ హాజరు, రిజిస్ట్రేషన్, తనిఖీ వంటి ప్రక్రియల దృష్ట్యా అభ్యర్థులు ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. సమీక్షలో అదనపు కలెక్టర్ పాండు, సంబంధిత శాఖల అధికారులు, సెంటర్ సూపరింటెండెంట్లు, డిప్యూటీ సూపరింటెండెంట్లు, అబ్జర్వర్లు, డీఎంహెచ్‌ఓ, మున్సిపల్ కమిషనర్, ఆర్టీవో, ఆర్టీసీ, విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు.


