రెచ్చిపోతున్న గ్రామసింహాలు | - | Sakshi
Sakshi News home page

రెచ్చిపోతున్న గ్రామసింహాలు

Apr 28 2026 8:40 AM | Updated on Apr 28 2026 8:40 AM

వీధి కుక్కల బెడదను నివారించేందుకు సంతాన నియంత్రణ ఆపరేషన్లు చేసేవారు. ప్రస్తుతం ఆ ఆపరేషన్లు చేయకపోవడంతో కుక్కలు విపరీతంగా పెరిగి గుంపులుగుంపులుగా తిరుగుతూ ప్రజలపై దాడులు చేస్తున్నాయి. దీంతో భయబ్రాంతులకు గురవుతున్నారు.

– సిద్దిపేటకమాన్‌

పాఠశాలలకు వేసవి సెలవులు రావడంతో బెజ్జంకి మండలంలో ఓ పదేళ్ల బాలుడు తోటి పిల్లలతో కలిసి ఇంటి బయట ఆడుకుంటున్నాడు. ఐదు రోజుల క్రితం ఇంటి బయట ఆడుకుంటున్న బాలుడిపై వీధికుక్క అకస్మాత్తుగా దాడి చేసి చేతిపై కరిచింది. తీవ్ర రక్తస్రావం కావడంతో పాటు బాబు చేతి వేళ్లకు సంబంధించిన కండరం, ఎముకకు గాయమైంది. బాబు ప్రస్తుతం సిద్దిపేట ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. జిల్లాలో ఏదో ఒక చోట ప్రతి రోజు వీధి కుక్కల దాడులు జరుగుతూనే ఉన్నాయి.

అకస్మాత్తుగా దాడులు

జిల్లాలోని సిద్దిపేట, గజ్వేల్‌, దుబ్బాక, చేర్యాల, హుస్నాబాద్‌ మున్సిపాలిటీల పరిధితో పాటు మండల కేంద్రాలు, చాలా గ్రామాల్లో వీధి కుక్కలు దాడులు చేస్తూ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. రోడ్లపై వెళ్లే వాహనదారులు, సైకిళ్లపై వెళ్తున్న వారి వెంటపడి పరుగులు పెట్టిస్తున్నాయి. వేసవిలో ఎండ ప్రభావంతో కోపం, చిరాకుతో వీధి కుక్కలు అకస్మాత్తుగా పిల్లలు, వృద్ధులపై దాడి చేసి గాయపరుస్తున్నాయి. సంబంధిత అధికారులు స్పందించి కుక్కల భారీ నుంచి కాపాడాలని పలువురు కోరుతున్నారు. చికెన్‌ సెంటర్ల నిర్వాహకులు వ్యర్థాలను రోడ్లపై వేయడంతో వాటిని తింటున్న కుక్కలు రోడ్డు వెంట నడుచుకుంటూ వెళ్లే వారిపై దాడులు చేస్తున్నాయని ప్రజలు వాపోతున్నారు.

గతేడాది 7వేల మంది బాధితులు

జిల్లాలో గతేడాది 7,727మంది కుక్క కాటుకు గురయ్యారు. వీరికి జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏఆర్‌వీ (యాంటీ రేబిస్‌ వ్యాక్సిన్‌) తీసుకున్నారు. ఈ ఏడాది జనవరిలో 603, ఫిబ్రవరిలో 527, మార్చిలో 475, ఏప్రిల్‌లో ఇప్పటి వరకు 397మందితో కలిపి మొత్తం 2002 మంది కుక్క కాటుకు గురయ్యారని అధికారులు తెలిపారు. వారికి ఏఆర్‌వీ వ్యాక్సిన్‌ వేసినట్లు జిల్లా ఇన్‌చార్జి డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ వినోద్‌బాబ్జి తెలిపారు. ప్రస్తుతం జిల్లాలోని అన్ని పీహెచ్‌సీలు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏఆర్‌వీ 14,167, ఏఆర్‌ఎస్‌ 1,805, హెచ్‌ఆర్‌ఐజీ 980 వ్యాక్సిన్‌ నిల్వలు ఉన్నట్లు పేర్కొన్నారు. ఎవరైనా కుక్కకాటుకు గురైతే వెంటనే సంబంధిత పీహెచ్‌సీ, ప్రభుత్వాస్పత్రికి వెళ్లి వ్యాక్సిన్‌ తీసుకోవాలని వైద్యులు సూచించారు.

భయాందోళనలో ప్రజలు

వీధుల్లో, రోడ్లవెంట వెళ్లేవారిపై దాడులు

జిల్లాలో గతేడాది 7,727.. ఈఏడాది 2వేల మంది బాధితులు

వీధి కుక్కల నియంత్రణకు

చర్యలు శూన్యం

Advertisement
 
Advertisement
Advertisement