గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్‌లో ‘గజ్వేల్‌’ | - | Sakshi
Sakshi News home page

గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్‌లో ‘గజ్వేల్‌’

Apr 28 2026 8:40 AM | Updated on Apr 28 2026 8:40 AM

గజ్వేల్‌రూరల్‌: కరాటేలో గజ్వేల్‌ విద్యార్థులకు గిన్నిస్‌ రికార్డ్‌లో స్థానం లభించింది. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియంలో ఈనెల 26న గిన్నిస్‌ ప్రపంచ రికార్డ్‌ లార్జెస్ట్‌ కరాటే డిస్‌ప్లే నిర్వహించారు. ఈ సందర్భంగా పోటీల్లో కటా విభాగంలో గజ్వేల్‌కు చెందిన 18 మంది విద్యార్థులు భాగస్వాములైనట్లు నిర్వా హకులు సోమవారం పేర్కొన్నారు. గతేడాది చైన్నెలో 864 మంది విద్యార్థులతో ఉన్న గిన్నిస్‌ రికార్డును ఈ యేడాది గచ్చిబౌలి స్టేడియంలో 2200 మంది విద్యార్థులు బ్రేక్‌ చేసినట్లు తెలిపారు. కాగా గిన్నిస్‌ రికార్డ్‌లో భాగస్వాములైన కరాటే విద్యార్థులను క్రీడాభిమానులు అభినందించారు.

వసంతకు జాతీయ అవార్డు

హుస్నాబాద్‌: పట్టణానికి చెందిన రచయిత్రి ఇంజపురి వసంత రాసిన వసంత వల్లరి తెలుగు గజల్‌ సంపుటికి వీ.జీ.ఎఫ్‌ జాతీయ అవార్డు లభించింది. హైదరాబాద్‌కు చెందిన విశ్వపుత్రిక గజల్‌ ఫౌండేషన్‌ 5వ వార్షికోత్సవం సోమవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వీ.జీ.ఎఫ్‌ అధ్యక్షురాలు డాక్టర్‌ విజయలక్ష్మి పండిట్‌, కార్యదర్శి బిక్కి కృష్ణ ఆమెకు జాతీయ అవార్డును అందజేశారు.

జాబేర్‌ పాషకు

జాతీయ పురస్కారం

కోహెడరూరల్‌(హుస్నాబాద్‌): ప్రముఖ కవి డాక్టర్‌ రాధేయ ఆధ్వర్యంలో నాలుగు దశాబ్దాలుగా సాగుతున్న ఉమ్మడి శెట్టి సాహితీ అవార్డుల ప్రదానోత్సవం అనంతపురంలోని ప్రభుత్వ కళాశాల వేదికగా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మండలంలోని బస్వాపూర్‌ గ్రామానికి చెందిన యువకవి జాబేర్‌ పాష ప్రతిష్టాత్మకమైన ఉమ్మడిశెట్టి సాహితీ జాతీయ పురస్కారం అందుకున్నారు. ఇటీవల ఆయన వెలువరించిన అగరు ధూపం, ఊదు పొగ కవితా సంపుటికి గాను ఈ పురస్కారం దక్కింది.ఈ సందర్భంగా కవికి రూ.10 వేల నగదు, ప్రశంసా పత్రం అందజేశారు.

వ్యక్తి అదృశ్యం

టేక్మాల్‌(మెదక్‌): వ్యక్తి అదృశ్యమయ్యాడు. ఈ సంఘటన మండలంలోని తంప్లూర్‌లో సోమవారం ఆలస్యంగా వెలుగుచూసింది. హెడ్‌కానిస్టేబుల్‌ దేవీదాస్‌ వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన చాకలి నర్సింహులు(36)కు పదేళ్ల క్రితం అనితతో వివాహమైంది. వీరికి ముగ్గురు సంతానం. వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. నర్సింహులు నెల రోజుల క్రితం ఇంట్లో ఎవరికి చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయాడు. కుటుంబ సభ్యులు, బంధువుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. 10రోజుల క్రితం నర్సింహులు తన భార్య అనితకు ఫోన్‌ చేసి నేను హైదరాబాద్‌లో ఉన్నానని, నాఫోన్‌ పోయిందని.. వేరోక నంబర్‌తో ఫోన్‌ చేసి చెప్పాడు. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు దగ్ధం

చేగుంట(తూప్రాన్‌): ప్రమాదవశాత్తు ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు దగ్ధమైంది. ఈ సంఘటన మాసాయిపేట మండల పరిధిలోని 44వ జాతీయ రహదారిపై సోమవారం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం... గౌతమీ ట్రావెల్స్‌కు చెందిన ప్రైవేటు బస్సుకు మెదక్‌లో మరమ్మతులు చేయించుకొని హైదరాబాద్‌కు తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం మాసాయిపేట శివారులో బస్సులో మంటలు రావడంతో డ్రైవర్‌, క్లీనర్‌ పారిపోయారు. సమాచారం అందుకున్న రామాయంపేట సీఐ వెంకటరాజాగౌడ్‌ , చేగుంట ఎస్‌ఐ చైతన్యకుమార్‌రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని ఫైర్‌ సిబ్బందితో మంటలను ఆర్పివేయించారు. బస్సులో ప్రయాణికులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై ఫిర్యాదు అందలేదని, పూర్తి వివరాలను సేకరిస్తున్నట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement