‘పుచ్చ’ ధర ఢమాల్‌ | - | Sakshi
Sakshi News home page

‘పుచ్చ’ ధర ఢమాల్‌

Apr 28 2026 8:40 AM | Updated on Apr 28 2026 8:40 AM

జహీరాబాద్‌ టౌన్‌: పుచ్చ సాగు చేసిన రైతులు నష్టాలు చవిచూస్తున్నారు. వేసవిలో మంచి లాభాలు వస్తాయనే ఆశతో పెట్టుబడులు పెట్టిన రైతులకు తెగుళ్లు, ధరల పతనం వల్ల కన్నీళ్లు వస్తున్నాయి. డిమాండ్‌ లేక ధరలు పతనమయ్యాయి. ప్రస్తుతం మార్కెట్‌లో కిలోకు రూ. 6 నుంచి రూ.7 పలుకుతుంది. ధరలు పడిపోవడం వల్ల వేల రుపాయల పెట్టుబడులు పెట్టిన రైతులు నష్టపోతున్నారు. మంచి లాభాలు తెచ్చిపెడుతోందని, దళారుల బెడద ఉండదని రైతులు పుచ్చకాయల సాగుకు మొగ్గు చూపారు. పంట చేతికి వచ్చే సమయానికి ధరలు పతనం కావడంతో ఆందోళన చెందుతున్నారు.

1600 ఎకరాల్లో సాగు..

వేసవిలో అధికంగా వినియోగించే పుచ్చ సాగుపై జిల్లాలోని పలు ప్రాంత రైతులు దృష్టిపెట్టారు. 65 రోజుల నుంచి 70 రోజుల్లో పంటచేతికి వస్తుందని, లాభాలు కూడా బాగా వస్తాయని సుమారు 1600 ఎకరాల్లో పంట సాగు చేశారు. వాతావరణం అనుకూలంగా ఉండటంతో జహీరాబాద్‌ ప్రాంత రైతులు కొన్నేళ్ల నుంచి పుచ్చ పంటను సాగు చేస్తున్నారు. ఈ సంవత్సరం పంట దిగుబడి పెరగడంతో మార్కెట్‌ను ముంచెత్తింది. మార్కెట్‌లో ఎక్కడ చూసినా పుచ్చకాయలు దర్శనమిస్తున్నా.. కొనేవారు లేరు. దీంతో ధరలు భారీగా పడిపోయాయి.

ధర లేక ఇబ్బందులు

రంజాన్‌ పర్వదినం సమయంలో ధరలు పెరుగుతాయని రైతులు ఆశించారు. కానీ ధరలు మాత్రం పెద్దగా పెరగలేదు. ప్రస్తుతం కిలో రూ. 6 నుంచి రూ.10 పలుకుతుంది. గత సంవత్సరం కిలో రూ.15 నుంచి రూ. 20 వరకు పలికింది. పుచ్చ సాగు చేయడానికి ఎకరానికి రూ. 60 వేల వరకు ఖర్చు అవుతుంది. వాస్తవానికి ఎకరానికి 25 క్వింటాళ్ల వరకు దిగుబడి రావాల్సి ఉండగా తెగుళ్ల కారణంగా ఎకరానికి 15 క్వింటాళ్లు వచ్చింది. డిమాండ్‌ తగ్గడం వల్ల కొనేందుకు వ్యాపారులు ముందుకు రాకపోవడంతో కొంద మంది రైతులు పుచ్చకాయలను పొలంలోనే వదిలేస్తున్నారు. తెగుళ్ల కారణంగా కాయ సైజు పెరుగుదల నిలిచిపోయింది. పక్కనే ఉన్న కర్నాటక, మహరాష్ట్ర నుంచి కూడా ప్రతి రోజు రైతులు పుచ్చకాయలు జహీరాబాద్‌ మార్కెట్‌కు తీసుకొస్తున్నారు. దీంతో డిమాండ్‌ తగ్గి ధరలు పడిపోయాయని రైతులు వాపోతున్నారు.

సాగు చేసిన అన్నదాత దిగాలు

పెరిగిన పంట సాగు

పెట్టుబడి రాక నష్టాలు

చేనులోనే వదిలేస్తున్న వైనం

Advertisement
 
Advertisement
Advertisement