పాపన్నపేట(మెదక్): చిన్నారి కాళ్ల కడియాలు దొంగతనం చేస్తున్న సమయంలో గమనించిన క్యూఆర్టీ టీం వెంటనే నిందితున్ని అదుపులోకి తీసుకొని వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన ఆదివారం ఏడుపాయల్లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఏడుపాయల దుర్గమ్మ తల్లిని దర్శించుకునేందుకు ఖాజిపల్లికి చెందిన స్వప్న, మహిపాల్ దంపతులు తమ కూతురు రేవతితో కలిసి వచ్చారు. వారు దుకాణంలో కొనుగోళ్లు చేస్తున్నారు. ఈ సమయంలో వారి చిన్నారిని పక్కకు తీసుకెళ్లిన అగంతకుడు, బుజ్జగిస్తూ కాళ్ల కడియాలు దొంగిలించాడు. అక్కడే విధి నిర్వహణలో ఉన్న క్విక్ రెస్పాన్స్ టీం సభ్యులు వెంటనే అప్రమత్తమయ్యారు. నిందితున్ని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా మొదట తనకు ఏమి తెలియదని బుకాయించాడు. గట్టిగా నిలదీయడంతో దుస్తుల్లో దాచుకున్న వెండి కడియాలను అప్పగించాడు. వెంటనే నిందితున్ని స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు.


