అగ్నిప్రమాదంలో గుడిసె, ధాన్యం దగ్ధం | - | Sakshi
Sakshi News home page

అగ్నిప్రమాదంలో గుడిసె, ధాన్యం దగ్ధం

Apr 27 2026 8:36 AM | Updated on Apr 27 2026 8:36 AM

అగ్నిప్రమాదంలో గుడిసె, ధాన్యం దగ్ధం గడువు దాటిన కూల్‌డ్రింక్‌ విక్రయం ప్రైవేట్‌ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడి ఎన్నిక టైలరింగ్‌లో ఉచిత శిక్షణ చెరువులో పడి వ్యక్తి మృతి

పాపన్నపేట(మెదక్‌): మండల పరిధిలోని మిన్‌పూర్‌లో ఆదివారం సాయంత్రం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నివాస గుడిసె, అందులో ఉన్న మేకలతో పాటు పక్కన ఆరబోసిన ధాన్యం కాలిపోయి సుమారు రూ.10 లక్షల ఆస్తినష్టం సంభవించిందని బాధితులు తెలిపారు. వివరాలు ఇలా... ప్రమాదవశాత్తు మొదట పూరి గుడిసె, రేకుల షెడ్డుకు నిప్పంటుకోగా ,అందులో ఉన్న నాలుగు మేకపిల్లలు, రూ.లక్ష నగదు దగ్ధం అయినట్లు బాధితుడు గోదారి సాయిలు తెలిపారు. గుడిసె పక్కన హనుమంతు అనే వ్యక్తి ధాన్యం ఆరబోయగా మంటలంటుకొని సుమారు రూ.లక్ష ఆస్తి నష్టం జరిగింది. ఫైర్‌ ఇంజన్‌తో మంటలను అదుపు చేశారు.

స్వీట్‌హౌస్‌ యజమానిపై కేసు నమోదు

నర్సాపూర్‌ రూరల్‌: గడువు దాటిన థమ్స్‌అప్‌ విక్రయించిన ఘటన నర్సాపూర్‌ పట్టణంలో ఆదివారం కలకలం రేపింది. వివరాలు ఇలా... శివాలయం వీధిలో నివాసం ఉండే కంది హరిబాబు నర్సాపూర్‌ బస్టాండ్‌ హనుమాన్‌ ఆలయం సమీపంలోని ఓ స్వీట్‌ హౌస్‌లో 1 లీటర్‌ థమ్స్‌అప్‌ కొనుగోలు చేసి ఇంటికి వచ్చాడు. కుటుంబ సభ్యులు అంతా కలిసి తాగేందుకు మూత ఓపెన్‌ చేసి హరిబాబు ముందుగా కొంత తాగాడు. టేస్ట్‌లో తేడా ఉండటంతో గడువు తేదీని పరిశీలించగా గత ఏడాది 2025 సెప్టెంబర్‌ 15తో గడువు తేదీ కనిపించింది. ఈ విషయమై వెంటనే స్వీట్‌ హౌస్‌ వద్దకు వెళ్లి ప్రశ్నించగా తమకు పట్టనట్లు వ్యవరించడంతో బాధితుడు 100 కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు విచారించగా గడువు దాటిన థమ్స్‌అప్‌ విక్రయించిన స్వీట్‌హౌస్‌ యజమానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రంజిత్‌ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా బాధితుడు హరిబాబు మాట్లాడుతూ.. ఇంకా పిల్లలకు తాగిస్తే ఏమై ఉండేదో అని ఆందోళన వ్యక్తం చేశాడు.

పటాన్‌చెరు టౌన్‌: ప్రైవేట్‌ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా రాజు గోపాల్‌ యాదవ్‌ను నియమించినట్లు రాష్ట్ర కనీస వేతన సలహా మండలి చైర్మన్‌ జనక్‌ ప్రసాద్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఇస్నాపూర్‌ మున్సిపాలిటీ పరిధిలోని పాశమైలారంలో నిర్వహించిన సమావేశంలో ఉపాధ్యక్షుడిగా నియమిస్తూ నియామక పత్రం ఆయనకు అందజేశారు. ఈ సందర్భంగా రాజు గోపాల్‌ యాదవ్‌ మాట్లాడుతూ... ప్రైవేటు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. తనపై విశ్వాసాన్ని ఉంచి రాష్ట్ర స్థాయిలో అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర కనీస వేతన సలహా మండలి బోర్డు మెంబర్‌ రాజు ముదిరాజ్‌, కార్మిక నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.

మెదక్‌ కలెక్టరేట్‌: మిల్లి అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ఉచిత టైలరింగ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. పట్టణంలోని అజాంపురా వీధిలో గల మైనారిటీ ఫంక్షన్‌ హాలులో మౌలానా జావేద్‌ అలీ హుస్సామీ ఈ సెంటర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. మహిళలు టైలరింగ్‌ సెంటర్‌ను సద్వినియోగం చేసుకొని శిక్షణ పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో మౌలానా జావేద్‌ అలీ, ఎంఎంఏ అధ్యక్షుడు, జనరల్‌ సెక్రటరీ డాక్టర్‌ ఉమర్‌ ఖాన్‌, డాక్టర్‌ సూఫీ షుజాత్‌ అలీ, జనాబ్‌ మీర్‌ జఫరుల్లా తాహిర్‌, ముఫ్తీ డాక్టర్‌ మీర్‌ ఆబిద్‌ అలీ, ముఫ్తీ సాబిర్‌ , ఆరిఫ్‌ అంజద్‌ తదితరులు పాల్గొన్నారు.

పటాన్‌చెరు టౌన్‌: చెరువులో పడి వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన పటాన్‌చెరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ రాజు తెలిపిన వివరాల ప్రకారం... ఇస్నాపూర్‌ మున్సిపల్‌ పరిధిలోని రుద్రారం గ్రామానికి చెందిన పశువుల కాపరి పనికి వెళ్లే రమేశ్‌(48) రెండు రోజులుగా కనిపించట్లేదు. దీంతో చుట్టుపక్కల, తెలిసిన వారి వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. రుద్రారం పెద్ద చెరువులో ఆదివారం మృతదేహం తేలడంతో బయటికి తీయించారు. ఈ మేరకు పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం పటాన్‌చెరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement