హెచ్చరిక బోర్డులేవీ? | - | Sakshi
Sakshi News home page

హెచ్చరిక బోర్డులేవీ?

Apr 27 2026 8:36 AM | Updated on Apr 27 2026 8:36 AM

మిరుదొడ్డి(దుబ్బాక): ఎలాంటి ప్రమాద హెచ్చరిక బోర్డులు లేకుండా ఉన్న మిరుదొడ్డి – ధర్మారం రోడ్డు ఇప్పుడు హడలెత్తిస్తోంది. తరచూ మూల మలుపులు ప్రమాదాలకు నిలయాలుగా మారుతున్నాయి. ఏ మాత్రం ఆదమర్చినా ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. తీవ్ర గాయాలపాలైన క్షతగాత్రులు ఆస్పత్రుల్లో చేరి లక్షలకు లక్షలు ఖర్చు చేసి ఆర్థికంగా చితికి పోతున్నారు. ధర్మారం నుంచి ఆరెపల్లి, లక్ష్మీనగర్‌ చౌరస్తా మీదుగా మిరుదొడ్డి వరకు నాలుగు మూల మలుపులు ఉన్నాయి. వీటి వద్ద ఎలాంటి ప్రమాద హెచ్చరిక బోర్డులు లేకపోవడంతో పాటు, రోడ్డు కిరువైపులా చెట్లు కమ్మేయడంతో ఎదరుగా వచ్చే వాహనాలను గుర్తించక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని వాహనదారులు చెబుతున్నారు.

కొన్ని ఘటనలు..

● గత ఏడాది క్రితం సిద్దిపేటకు చెందిన సోహెల్‌ అనే స్టేట్‌ బాడీ బిల్డర్‌ బైక్‌పై ధర్మారం నుంచి మిరుదొడ్డికి వస్తున్న క్రమంలో ఆరెపల్లి శివారులోని మూల మలుపు వద్ద ఎదురెదురుగా బైక్‌, ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో సోహెల్‌ చికిత్స పొందుతూ మృతి చెందాడు.

● ఇటీవల మండల పరిధిలోని లింగుపల్లి గ్రామానికి చెందిన గంగయ్య ధర్మారం–మిరుదొడ్డి చౌరస్తాలో రోడ్డు దాటుటుండగా ఎదురుగా వచ్చిన వాహనం ఢీకొట్టడంతో మృతి చెందాడు.

● లక్ష్మీనగర్‌ చౌరస్తా శివారులోని మూల మలుపు వద్ద మల్లన్న సాగర్‌ ప్రాజెక్టులో మెగా కనన్‌స్ట్రక్షన్‌లో ఇంజనీరింగ్‌ విధులు నిర్వహిస్తున్న ఎన్‌సాన్‌పల్లికి చెందిన వెంకటేశ్‌ గౌడ్‌ బైక్‌పై నుంచి కిందపడి అక్కడికక్కడే ప్రాణాలను కోల్పోయాడు.

● అల్వాల గ్రామానికి చెందిన ఎండీ. హనీఫ్‌ అనే ఎలక్ట్రీషియన్‌ ఆరెపల్లి శివారులో బైక్‌, ఆటో ఢీకొన్న ప్రమాదంలో తన కుడి కాలును పొగొట్టుకొని తన జీవనాధారం కోల్పోయాడు. దీంతో చికిత్స చేయించుకోవడానికి ఆస్పత్రుల చుట్టూ తిరిగి సుమారు రూ.10 లక్షల అప్పులు చేసి ప్రస్తుతం దినదిన గండంగా బతుకీడుస్తున్నాడు.

మూల మలుపుల వద్ద ఎలాంటి ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయలేదు. తరచూ ప్రమాదాలు జరుగుతున్నా.. అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

ప్రమాదంలో కాలు పోగొట్టుకున్నా..

ఎలక్ట్రీషియన్‌గా పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకునే క్రమంలో మిరుదొడ్డి నుంచి ధర్మారం మీదుగా దుబ్బాకకు ఆటోలో వెళ్తున్నాను. ఆరెపల్లి శివారు మూల మలుపు వద్ద ఎదురుగా వస్తున్న బైక్‌, ఆటో ఢీకొన్నాయి. ప్రమాదంలో నా కుడి కాలు నుజ్జునుజ్జయింది. పక్కటెముకలు విరిగాయి. ప్రాణాలకు ముప్పుగా మారుతుందని చెప్పిన వైద్యులు నా కుడి కాలును పూర్తిగా తొలగించారు. దీంతో ఉపాధి కూడా కరువై.. కుటుంబాన్ని పోషించే స్తోమత లేకుండా పోయింది.

– ఎండీ. హనీఫ్‌, అల్వాల

Advertisement
 
Advertisement
Advertisement