రాంతీర్థ్, గోపన్‌పల్లి గ్రామాల్లో అంబేడ్కర్
విగ్రహాల ఆవిష్కరణలో మంత్రి వివేక్
హాజరైన ఎంపీ సురేశ్ షెట్కార్,
మాజీమంత్రి చంద్రశేఖర్
న్యాల్‌కల్(జహీరాబాద్): క్రమశిక్షణ, పట్టుదలతోపాటు చదువుకుంటే ఏదైనా సాధ్యమవుతుందని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ నిరూపించారని మంత్రి వివేక్ అన్నారు. మండల పరిధిలోని రాంతీర్థ్ గ్రామంలో ఏర్పాటు చేసిన అంబేడ్కర్ విగ్రహాన్ని మంత్రి ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ...నాడు అంబేడ్కర్‌కు జరిగిన వివక్షతవల్ల చదువుకు దూరమై ఉంటే నేడు రాజ్యాంగం నిర్మాతగా ఉండే వారు కాదన్నారు. దేశ నిర్మాణంలో కీలకపాత్ర పోషించిన అంబేడ్కర్ చూపిన మార్గంలో అందరూ నడుచుకోవాలని కోరారు. రాంతీర్థ్ నుంచి హద్నూర్ వరకు రోడ్డు బాగు చేయించాలని గ్రామ సర్పంచ్ శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు నర్సింహులు మంత్రి దృష్టికి తీసుకురాగా..అవసరమైన నిధులను మంజూరు చేయిస్తానని హామీనిచ్చారు. ఎంపీ సురేశ్ కుమార్‌షెట్కార్ మాట్లాడుతూ..అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం వల్లే దేశంలోని 140 కోట్లమంది నడుచుకుంటున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీ నుంచి 11 మంది ఎంపీలం సోనియాగాంధీ వద్దకు వెళ్లినప్పుడు అందులో వివేక్ పాత్ర ఎంతో కీలకమైందని గుర్తు చేశారు. కార్యక్రమంలో మాజీమంత్రి చంద్రశేఖర్, సెట్విన్ చైర్మన్ గిరిధర్‌రెడ్డి, టీఎస్‌ఐడీసీ మాజీ చైర్మన్ మహ్మద్ తన్వీర్, జహీరాబాద్ మున్సిపల్ చైర్మన్ యూనూస్, జహీరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తిరుపతిరెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శి భాస్కర్‌రెడ్డి, మండ ల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.
అంబేడ్కర్ అందరివాడు
జహీరాబాద్ టౌన్: బీఆర్ అంబేడ్కర్ కేవలం ఒక వర్గానికి లేదా ఒక జాతికి సంబంధించిన వారు కాదని ఆయన అందరివారని మంత్రి వివేక్ అన్నారు. మొగుడంపల్లి మండలంలోని గోపన్‌పల్లి గ్రామంలో ప్రతిష్టించిన అంబేడ్కర్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గొప్ప మానవీయ విలువలను బోధించారన్నారు.


