గ్రామాల్లో సహజ వనరుల దోపిడీ ఇష్టారాజ్యంగా సాగుతోంది. పొలాల గట్లు, వాగులు వంకలు, గుట్టలను గుల్ల చేస్తున్నారు. కాసులకు కక్కుర్తిపడి చెట్లను నిర్ధాక్షిణ్యంగా నరికి పర్యావరణానికి తూట్లు పొడుస్తున్నారు. యథేచ్ఛగా కలపను తరలిస్తూ వాల్టా చట్టాన్ని అతిక్రమించి సొమ్ము చేసుకుంటున్నారు. – జహీరాబాద్ టౌన్
జహీరాబాద్ నియోజవర్గంలోని పల్లె ప్రాంతాల్లో చెట్ల నరికివేత యథేచ్ఛగా సాగుతుంది. వాతావరణం కలుషితం కాకుండా మానవాళిని రక్షిస్తున్న పచ్చని చెట్లను వ్యాపారులు విచ్చలవిడిగా నరికేస్తున్నారు. ఏమాత్రం భయం లేకుండా లారీలు, ట్రాక్టర్లలో కలిపి తరలిస్తున్నారు. వాల్టా చట్టం ప్రకారం టేకు, వేప, తుమ్మ, తదితర రకాల చెట్లను నరికివేయడానికి అటవీశాఖ అనుమతులు తప్పనిసరి తీసుకోవాలి. ఎవరైనా చెట్లను తొలగించాలంటే వాటి వివరాలు, సంఖ్య, వాటి వయస్సును నమోదు చేయాలి. ఒక్కో చెట్టుకు రూ.500 అటవీశాఖ పేరుతో డిపాజిట్ చేయాలి. అన్ని అనుమతులు పొందిన తర్వాతే కలపను తరలించుకోడానికి అవకాశం ఉంటుంది.
రెండు మొక్కలు నాటే నిబంధన అమలేది?
చెట్లను తొలగించిన తర్వాత చెట్టుకు బదులు రెండు మొక్కలను నాటాలి. మూడేళ్లపాటు వాటిని సంరక్షించాలి. అలా చేయడం వల్ల డిపాజిట్ చేసిన మొత్తాన్ని తిరిగి ఇస్తారు. కానీ నిబంధనలు ఎవరూ పాటించడం లేదు. అటవీశాఖ అధికారుల అండదండలతో యథేచ్ఛగా చెట్లను నరికి వేస్తున్నారు. దీని కారణంగా వృక్ష సంపద అంతరించిపోతుంది. మొగుడంపల్లి. కోహీర్, జహీరాబాద్ మండలంలో వ్యవసాయ భూముల్లో పెరిగిన చెట్లను నరికివేస్తూ కలపను తరలిస్తున్నారు. ప్రభుత్వం హరితహారం పేరుతో కోట్ల రుపాయలు ఖర్చు చేసి మొక్కను పెంచుతుంటే మరోవైపు వాటిని నరికివేస్తుండటంతో ఆ పథకం అసలు లక్ష్యం దెబ్బతింటుంది. సంబంధిత అటవీశాఖ అధికారులు ఈ విషయమై దృష్టి సారించి చెట్ల అక్రమ నరికివేతపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
దళారులపై చర్యలు తీసుకోవాలి
పచ్చని చెట్లను నరికే దళారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. చెట్ల నరికివేత కారణంగా భవిష్యత్‌లో కరువు కాటకాలు వచ్చే అవకాశాలున్నాయి. మొగుడంపల్లి మండలంలో అటవీప్రాంతం ఉండటంతో వ్యవసాయ పొలాలతో అటు ఫారెస్టు చెట్లను కూడా నరికివేస్తున్నారు. అధికారులు గట్టి నిఘా పెట్టి దళారులపై చర్యలు తీసుకోవాలి. – వినయ్ పవార్,
మానవ హక్కుల సంఘం నాయకులు
వాల్టాకు తూట్లు
నిర్ధాక్షిణ్యంగా చెట్ల నరికివేత
యథేచ్ఛగా కలప రవాణ
కళ్లుమూసుకుంటున్న
అటవీ అధికారులు


