బెస్ట్ అవైలబుల్ పథకం
దరఖాస్తు ఇలా..
మెదక్ కలెక్టరేట్: నిరుపేద గిరిజన విద్యార్థులకు కార్పొరేట్ విద్య నందించేందుకు ప్రభుత్వం బెస్ట్ అవైలబుల్ పథకానికి శ్రీకారం చుట్టింది. ప్రతి ఏడాది ఎంతో మంది నిరుపేద విద్యార్థులకు ఈ పథకం కింద కార్పొరేట్ విద్యను ఉచితంగా అందిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ 2026–27 విద్యా సంవత్సరానికి అర్హులైన నిరుపేద గిరిజన విద్యార్థులకు అవకాశం కల్పించే చర్యలు చేపట్టింది. ప్రభుత్వం నుంచి అనుమతులు పొందిన ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో విద్యనభ్యసించేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. ఎంపికై న విద్యార్థులకు కార్పొరేట్ విద్య అందించేందుకు సంగారెడ్డి జిల్లాలోని సేయింట్ జోసెఫ్ హైస్కూల్, సిద్దిపేట జిల్లాలోని శ్రీ విద్యారణ్య ఆవాస విద్యాలయాలు అందుబాటులో ఉన్నాయి. ఎంపికై న వారికి ఈ పాఠశాలల్లో ఉచితంగా ప్రవేశం కల్పిస్తారు.
జిల్లాకు 20 సీట్లు..
జిల్లాలో ప్రస్తుతం 20 సీట్లు ఖాళీగా ఉన్నాయి. బాలిక విద్యను ప్రోత్సహించే క్రమంలో బాలికలకు ప్రభుత్వం 33శాతం రిజర్వేషన్ కల్పిస్తుంది. 20 సీట్లలో 6మంది బాలికలకు కేటాయిస్తారు. మిగతా 14 సీట్లలో ఇతర విద్యార్థులకు ప్రవేశం కల్పిస్తారు. ప్రస్తుతం 3వ తరగతిలో 10 సీట్లు, 5వ తరగతిలో 5 సీట్లు, 8వ తరగతిలో 5 సీట్లు ఖాళీలు ఉన్నాయి. జిల్లాలోని గిరిజన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.
ఈనెల 29 వరకు..
ఆసక్తి, అర్హత గల విద్యార్థులు మెదక్ సమీకృత కలెక్టరేట్‌లోని రెండో అంతస్తులో గల గిరిజన సంక్షేమ కార్యాలయంలో ఈనెల 29 వరకు దరఖాస్తు ఫారాలను పొందవచ్చు. అన్ని వివరాలతో పూర్తి చేసిన దరఖాస్తును తిరిగి ఇదే కార్యాలయంలో మే 7వ తేదీ సాయంత్రంలోపు అందజేయాలి.
జిల్లాలో 20 సీట్లు ఖాళీ
బాలికలకు 33శాతం రిజర్వేషన్
ఈనెల 29 వరకు దరఖాస్తుల ఆహ్వానం
విద్యార్థులు మెదక్ జిల్లాకు చెందినవారై ఉండాలి. విద్యార్థుల తల్లిదండ్రుల సంవత్సర ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.లక్షా50వేలు, పట్టణ ప్రాంతాల వారికి రూ.2 లక్షల లోపు ఉండాలి. దీంతోపాటు మీ సేవ నుంచి పొందిన కులం, మున్సిపల్ లేదా తహసీల్దార్‌తో ధ్రువీకరించిన పుట్టిన తేదీ పత్రాలు కలిగి ఉండాలి. రేషన్ కార్డు, ఆధార్ కార్డు, గత సంవత్సరం పూర్తి చేసిన తరగతి బోనఫైడ్, సర్టిఫికెట్ జిరాక్స్ కాపీలు, 2పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు జతపర్చి దరఖాస్తు పూర్తి చేయాలి.


