అంబేడ్కర్‌ అవార్డుకు ఎంపిక | - | Sakshi
Sakshi News home page

అంబేడ్కర్‌ అవార్డుకు ఎంపిక

Apr 25 2026 9:24 AM | Updated on Apr 25 2026 9:24 AM

అంబేడ్కర్‌ అవార్డుకు ఎంపిక తల్లీకొడుకు అదృశ్యం గంజాయి మొక్కలు స్వాధీనం పిడుగుపాటుకు గేదె మృతి జైలులో ఖైదీ ఆత్మహత్యాయత్నం

చిన్నశంకరంపేట(మెదక్‌): అంబేడ్కర్‌ జాతీయ అవార్డుకు మండలంలోని కొర్విపల్లి గ్రామానికి చెందిన తెలంగాణ అంబేడ్కర్‌ సంఘం జిల్లా అధ్యక్షుడు రామచంద్రంను ఎంపిక చేశారు. స్ఫూర్తి సర్వీస్‌ సొసైటీ ఇండియన్‌ ఎన్జీఓ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన బహుజన ఆత్మీయ సదస్సులో రామచంద్రంను అవార్డుకు ఎంపిక చేసినట్లు స్ఫూర్తి సంస్థ చైర్మన్‌ లయన్‌ డాక్టర్‌ రమేశ్‌ తెలిపారు. మెదక్‌ జిల్లాలో అంబేడ్కర్‌ సంఘం ద్వారా ఆయన ఆశయ సాధనకు చేస్తున్న కృషికి ఈ అవార్డు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. జూన్‌ 15న హైదరాబాద్‌లోని సరస్వతి ఆడిటోరియంలో నిర్వహించే కార్యక్రమంలో అవార్డును అందించనున్నారు.

సంగారెడ్డి క్రైమ్‌: తల్లీకొడుకు అదృశ్యమైన ఘటన సంగారెడ్డి పట్టణంలో చోటుచేసుకుంది. సీఐ రామునాయుడు వివరాల ప్రకారం.. అందోల్‌ మండలానికి చెందిన బోయిని నాగలక్ష్మి(27), తన కొడుకు అకుల్‌(6), భర్త అశోక్‌ కుమార్‌తో కలిసి కొన్నేళ్లుగా పట్టణంలోని బృందావన కాలనీలో జీవిస్తున్నారు. ఈ నెల 20న నాగలక్ష్మిని భర్త మందలించాడు. అదే రోజు తన కొడుకును తీసుకొని ఇంటి నుంచి వెళ్లిపోయింది. తిరిగి ఇంటికి రాలేదు. ఫోన్‌ చేస్తే స్విచ్చాఫ్‌ వచ్చింది. చుట్టుపక్కల, తెలిసిన బంధువుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కల్హేర్‌(నారాయణఖేడ్‌): గంజాయి మొక్కలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్‌ఐ మహేశ్‌ వివరాల ప్రకారం... సిర్గాపూర్‌ మండలం హెమ్లానాయక్‌ తండాకు చెందిన చరణ్‌సింగ్‌ ఇంటి ఆవరణలో గంజాయి మొక్కలు పెంచుతున్నాడు. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు దాడి చేసి స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

చేర్యాల(సిద్దిపేట): పిడుగు పాటుకు పాడిగేదె మృతి చెందింది.ఈ ఘటన మండలంలోని తాడూరు గ్రామంలో చేటు చేసుకుంది. శుక్ర వారం స్థానికులు ,బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన నర్ర రాజిరెడ్డికి చెందిన గేదె గురువారం రాత్రి పిడుగు పాటుతో మృతి చెందింది. దాని విలువ సుమారు రూ.లక్ష వరకు ఉంటుందని బాధిత రైతు తెలిపాడు. కాగా ప్రభుత్వం ఆదుకోవాలని కోరాడు.

సంగారెడ్డి సెంట్రల్‌ జైలులో ఘటన

సంగారెడ్డి టౌన్‌: జైలులో ఓ ఖైదీ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జైలు అధికారుల వివరాల ప్రకారం... సంగారెడ్డి జిల్లా రాయికోడ్‌ మండలం శంశోద్దీన్‌పూర్‌కు చెందిన వినోద్‌ (24)పై సంగారెడ్డి, జహీరాబాద్‌ పోలీస్‌ స్టేషన్లలో పలు చోరీ కేసులున్నాయి. జిల్లా కోర్టు 6 నెలల శిక్ష విధించగా 4నెలల క్రితం సంగారెడ్డి సెంట్రల్‌ జైలుకు తరలించారు. వినోద్‌ ఆర్వో వాటర్‌ ప్లాంట్‌లో వినియోగించే కెమికల్‌ను తాగానని చెప్పడంతో జైలు అధికారులు వెంటనే సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై జైల్‌ సూపరింటెండెంట్‌ సంతోష్‌కుమార్‌ రాయ్‌తో మాట్లాడగా... వినోద్‌ ఆత్మహత్యాయత్నానికి పాల్పడలేదన్నారు. సిబ్బందిని బెదిరించడానికి మాత్రమే కెమికల్‌ తాగినట్టు నాటకం ఆడాడని చెప్పారు. వైద్య పరీక్షల అనంతరం జైలుకు తరలిస్తామన్నారు. ఈ ఘటనపై విచారణ అనంతరం సంబంధిత ఖైదీపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement